Cyber Security Professionals Demand: ఐటీ రంగం గత కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో అవకాశాల కొరతతో ఐటీ నిపుణులు ఇబ్బంది పడుతున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీ విభాగంలో మాత్రం నిపుణులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.
మెజారిటీ కంపెనీలు సైబర్ దాడుల రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీలపై సైబర్ అటాక్స్ పెరుగుతుండడంతో సైబర్ సెక్యూరిటీ నిపుణుల నియామకాలపై సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. దీంతో సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్నవారెవరూ ఖాళీగా ఉండాల్సిన అవసరం లేనంతగా ఐటీ విభాగంలో జాబ్స్ లభిస్తున్నాయి. వాస్తవానికి ఐటీ కంపెనీలే సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం ఉన్నవారి కోసం అన్వేషిస్తున్నాయి. ఈ విషయాన్ని మానవ వనరుల సేవల సంస్థ ఇండీడ్ తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది నుంచి సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల సంఖ్య 14శాతం పెరిగినట్లు ఈ సంస్థ వివరించింది.
హైదరాబాద్‌లోనూ అధికంగా సైబర్ సెక్యూరిటీ జాబ్స్: సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల లభ్యత బెంగళూరులో అధికంగా ఉన్నట్లు ఇండీడ్ నివేదిక పేర్కొంది. ఐటీ పరిశ్రమకు కేంద్ర స్థానమై ఐటీ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండటం, ఎన్నో ఎంఎన్‌సీ కంపెనీలు కొలువు తీరడం ఇందుకు కారణం. తర్వాత స్థానాల్లో దిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, ముంబయి ఉన్నాయి. బెంగళూరుకు గట్టి పోటీగా ఎదుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు అధికంగా లభిస్తున్నాయని సమాచారం.
ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకునే అవకాశం:సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఎక్కడి నుంచి అయినా పనిచేసే అవకాశం కూడా లభిస్తోంది. అవసరమైన టెక్నాలజీ నైపుణ్యంతో పాటు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి ఈ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు అధిక ప్యాకేజీలతో లభిస్తున్నట్లు తెలుస్తోంది.