BSNL Live TV: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL.. కొత్త ప్లాన్స్, 4G నెట్ వర్క్ విస్తరణతో రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో కొత్త సేవలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. దేశంలో బీఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ సేవలు ప్రారంభించింది. దీంతో ఫైబర్ యూజర్లు 500 లైవ్ టీవీ ఛానళ్లను ఉచితంగా వీక్షించొచ్చని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ సర్వీసులను తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో తీసుకొచ్చినట్లు పేర్కొంది.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ లైవ్ టీవీ సర్వీసులు ఫైబర్ టు హోమ్ (FTTH) యూజర్లకు మాత్రమే లభిస్తాయని తెలిపింది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా దీనిపై ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కాగా బీఎస్ఎన్ఎల్ ఈ సేవలను 'ఫస్ట్ ఇన్ ఇండియా'గా పిలుస్తోంది. అదేంటి ఇప్పటికే ఇండియాలో Jio Tv+ ఉంది కదా? మరి ఈ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఎలా మొదటిది అవుతుందని అనుకుంటున్నారా? అయితే ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీఎస్‌ఎన్‌ఎల్ లైవ్ టీవీ సర్వీస్ పూర్తిగా FTTH పై నడుస్తుంది. అయితే జియో టీవీ ప్లస్ మాత్రం పూర్తిగా HLS ఆధారిత స్ట్రీమింగ్పై నడుస్తుంది. ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం వుంది. జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి సంస్థలు టీవీ ఛానళ్లను వీక్షించినప్పుడు వినియోగించే డేటా నెలవారీ కోటా నుంచి మినహాయిస్తున్నాయి. జియో టీవీ ప్లస్ అనేది ఇంటర్నెట్ ప్లాన్‌పై ఆధారపడి నడుస్తుంది. అయితే బీఎస్ఎన్‌ఎల్ లైవ్ టీవీ ఛానళ్లు డేటాతో సంబంధం లేకుండానే లభిస్తాయి.