BMW Price Hike:దేశీయ లగ్జరీ కార్ల బ్రాండ్ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వచ్చే ఏడాదిలో తమ కార్ల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఇదే బాటలో BMW కంపెనీ కూడా తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది.
జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇన్పుట్ వ్యయం, కార్యకలాపాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు BMW పేర్కొంది. కస్టమర్లకు అన్ని సౌకర్యాలతో కూడిన ఉత్పత్తులను అందించడంలో మాత్రం రాజీ పడబోమని కంపెనీ స్పష్టం చేసింది. దేశీయంగా BMW కార్ల ధరలు రూ.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
BMW ప్రస్తుతం స్థానికంగా 2 సిరీస్ గ్రాన్ కూపేతో పాటు 3 సిరీస్ లాంగ్ వీల్బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్బేస్, 7 సిరీస్ వీల్బేస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ కార్లను తయారు చేస్తోంది. ఇవి కాకుండా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్, జెడ్4 ఎం40ఐ, ఎం2 కూపే మోడళ్లను పూర్తిగా తయారైన తర్వాత కంపెనీ దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేసుకుంటోంది. వచ్చే ఏడాది నుంచి వీటి ధరలు 3 శాతం మేర పెరగనున్నాయి. అయితే వీటిలో ఏ మోడల్ ధర ఎంత పెరగనుందో కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.