Indian National Deportation From US : అమెరికా నుంచి అక్రమ వలసదారుల మూడో బృందం భారత్ చేరుకుంది. 112మందితో కూడిన సీ-17 సైనిక విమానం ఆదివారం రాత్రి 10గంటల ప్రాంతంలో అమృత్‌సర్ విమానాశ్రయంలో లాండ్ అయింది.
అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వారిలో 44మంది హరియాణా వాసులు కాగా గుజరాత్ 33, పంజాబ్ 31, ఇద్దరు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. వారిలో ఇద్దరు శిశువులు, 19మంది మహిళలు, 14మంది మైనర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. అమెరికా తిప్పి పంపిన వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఈనెల 5నుంచి 10రోజుల వ్యవధిలో 3 విడతలుగా అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. తొలి విడతలో 104మంది, రెండో విడతలో 116 మంది భారత్‌కు చేరుకున్నారు.
సంకేళ్లతో భారత్‌కు
అక్రమ వలసదారుల విషయంలో మానవీయంగా వ్యవహరించాలని అమెరికా అధికారులకు చెప్పామని ఇటీవల విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ప్రకటన ఆచరణలో అమలు కాలేదు. వీరిని కూడా అమెరికా అధికారులు సంకెళ్లు వేసే భారత్‌కు తీసుకొచ్చారు. తొలి విడతలో ఈ నెల 5న వచ్చిన భారతీయులకూ ఇదే తరహా అనుభవం ఎదురైంది. 'కాళ్లకు గొలుసులు వేశారు. సంకెళ్లతో చేతులను బంధించారు. ముగ్గురు మహిళలకు, ఇద్దరు చిన్నారులకు మాత్రం సంకెళ్లు వేయలేదు' అని పంజాబ్‌కు చెందిన దల్జీత్ సింగ్ తెలిపారు. అమృత్‌సర్‌లో దిగే ముందు బంధనాల నుంచి తమకు విముక్తి కల్పించారని చెప్పారు.
'ఇక్కడే ఎందుకు'
మరోవైపు అక్రమ వలసదారుల విమానాలను దిల్లీలో కాకుండా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే ల్యాండ్ చెయ్యడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్‌ను, అక్కడి ప్రజలను అప్రతిష్టపాలు చేసే కుట్రలో భాగంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అక్రమవలసదారుల అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తోందని బీజేపీ నేత తరుణ్ చుగ్ అన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ నుంచి అమాయకపు యువత అమెరికాకు అక్రమంగా ఎందుకు, ఎలా వెళ్లాల్సి వచ్చిందో, ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు.