Australia Proposes to Ban Social Media for Children: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వినియోగం పిల్లల జీవితంపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు మానసిక కుంగుబాటుతో పాటు అనేక సమస్యలకు గురవుతున్నారు. దీంతో దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ కొత్త చట్టాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది.
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేలా చట్టం చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం వయసు ధ్రువీకరణ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
సోషల్ మీడియా వినియోగం పిల్లలకు హాని చేస్తోంది. దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అమ్మాయిల్లో అసభ్యకరమైన ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. మైసోజినిస్టిక్ టాపిక్స్ అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అశ్లీల దృశ్యాలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ఈ ఏడాది ఆస్ట్రేలియా పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అల్బనీస్ విలేకరుల సమావేశంలో తెలిపారు.