Hyderabad Airport on high Security Till January 31st : గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 31 వరకు హై అలర్ట్ ఉంటుందని జీహెచ్ఐఏఎల్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సందర్శకుల గ్యాలరీని మూసి వేస్తున్నందున విజిటర్స్ రావొద్దని పేర్కొన్నారు. ప్రత్యేక పోలీసులతో కలిసి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు వస్తున్న వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేశాకే లోనికి అనుమతిస్తున్నారు.
రన్ వే పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తున్న సిబ్బందిని పెంచారు. ఎయిర్లైన్స్ ప్రతినిధులు ప్రయాణికుల సామగ్రిని రెండు దశల్లో సమగ్రంగా పరిశీలించి విమాన సర్వీసులోకి తరలిస్తున్నారు. ప్రయాణికులకు వీడ్కోలు, స్వాగతం పలకడానికి ఇద్దరికి మించి రావొద్దని ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయంలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఎయిర్పోర్టు సిబ్బందికి లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.