Apple Accessibility Features :ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ యాపిల్ తమ ఐఫోన్, ఐప్యాడ్‌లలో సరికొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఐ ట్రాకింగ్, మ్యూజిక్ హాప్టిక్స్, వోకల్ షార్ట్కట్లు లాంటి ఫీచర్లు - దివ్యాంగులు కూడా చాలా సులభంగా యాపిల్ డివైజ్‌లను యాక్సెస్ చేసేందుకు ఉపయోగపడతాయని పేర్కొంది. బహుశా ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Apple Eye Tracking Feature :ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఐ ట్రాకింగ్ ఫీచర్ పనిచేస్తుంది. కనుక యూజర్లు తమ కంటి చూపుతో ఐఫోన్, ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లను చాలా సులువుగా నియంత్రించగలుగుతారు. అంతేకాదు ప్రత్యేక అవసరాలు కలిగినవారు కూడా యాపిల్ డివైజ్‌లను సులభంగా నావిగేట్ చేసేందుకు వీలుగా ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్ (ML) ఫీచర్లు కూడా తీసుకురానున్నట్లు యాపిల్ కంపెనీ తెలిపింది.
యాపిల్ డివైజ్‌ల్లోని ఫ్రంట్ కెమెరా కేవలం కొన్ని సెకెన్లలోనే యూజర్ల కళ్లను ట్రాక్ చేస్తుంది. కనుక స్క్రీన్‌ను టచ్ చేయకుండానే తమ కంటి కదలికలతో డివైజ్‌లను వారు నావిగేట్ చేయగలుగుతారు. అయితే దీని వల్ల వ్యక్తిగత గోప్యతకు కూడా ఎటువంటి భంగం వాటిల్లదని కంపెనీ చెబుతోంది. ఈ నయా ఫీచర్లు అన్ని యాప్‌లను యాక్సెస్ చేసేందుకు సాయపడతాయి. ఇందుకోసం అదనపు హార్డ్‌వేర్, యాక్సెసరీల అవసరం ఉండదు.