4G Vs 5G Nokia Report :భారత్‌లో 4జీ యూజర్లతో పోలిస్తే 5జీ నెట్వర్క్ వినియోగదారులు 3.6 రెట్లు ఎక్కువ డేటాను వాడుతున్నారని ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీదారు నోకియా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ (MBiT)-2024 నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికర అంశాలను అందులో ప్రస్తావించింది.
ఇందులో 2023లో డేటా ట్రాఫిక్‌లో 15 శాతానికి కేవలం 5జీ యూజర్లే కారణమని స్పష్టం చేసింది. మెట్రో నగరాల పరిధిలో అయితే మొబైల్ డేటా ట్రాఫిక్‌లో వీరి వాటా 20 శాతంగా ఉందని పేర్కొంది.
భవిష్యత్‌లో మరింత పెరగవచ్చు!
భారత దేశంలో టెలికాం సంస్థలు 5G సేవలను ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర గడుస్తుంది. గత ఐదేళ్లలో, దేశంలో మొబైల్ డేటా ట్రాఫిక్ (సీఏజీఆర్) 26% మేర పెరిగింది. 2023లో నెలకు 17.4 ఈబీ-ఎక్సాబైట్కు చేరుకుంది. అయితే ఈ డేటా వినియోగంలో పెరుగుదలకు ప్రధాన కారణం మాత్రం 5జీ డేటా వినియోగదారులే అని నోకియా తెలిపింది. ఈ పరిస్థితికి ముఖ్య కారణం- టెలికాం కంపెనీలు ఎటువంటి అదనపు ఛార్జీలు విధించకుండా అన్లిమిటెడ్ 5జీ డేటా సేవలను తమ కస్టమర్స్‌కు అందించడమే. ఇక మున్ముందు 5జీ సేవలను మరిన్ని పట్టణాలు, నగరాలకు విస్తరిస్తే గనుక మరింత మంది 4జీ వినియోగదారులు 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు లేకపోలేవు. అప్పుడు 5జీ వినియోగం విరివిగా పెరిగి డేటా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రతి 5GB డేటా వినియోగంలో 1GB డేటాను 5జీ సేవల ద్వారానే యూజర్స్ పొందుతున్నారని నోకియా తన నివేదికలో ప్రస్తావించింది. అయితే మన దేశంలో 5జీ సేవలకు సంబంధించి సంపూర్ణమైన వ్యవస్థ రానప్పటికీ మార్కెట్లో వస్తోన్న మరిన్ని పరికరాలు సాయంతో 5జీ వినియోగం వేగంగా విస్తరిస్తోందని టెక్ నిపుణులు అంటున్నారు.