2024 Maruti Suzuki Dzire:ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన ఫోర్త్ జనరేషన్ డిజైర్ అరుదైన ఘనత సాధించింది. ఇటీవలే రిలీజైన ఈ కాంపాక్ట్ సెడాన్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విషయంలో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. దీంతోపాటు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)కు సంబంధించి 4 స్టార్ పొందింది.
ఇదిలా ఉండగా సేఫ్టీ రేటింగ్ విషయంలో మారుతీ సుజుకీ చాలా కాలంగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో డిజైర్ ఫైవ్ స్టార్ రేటింగ్ అందుకుని సేఫ్టీ విషయంలో మారుతీ కార్లపై కస్టమర్లకు విశ్వాసాన్ని పెంచింది. దీంతో గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన ఫస్ట్ మారుతి కారుగా ఇది నిలిచింది. మారుతి ఈ కొత్త డిజైర్‌ను క్రాష్ టెస్టింగ్ కోసం గ్లోబల్ NCAPకి స్వచ్ఛందంగా పంపింది.
మారుతి సుజుకి డిజైర్‌లో అడల్ట్ సేఫ్టీ రేటింగ్: పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను ఈ కొత్త డిజైర్ 31.24 పాయింట్ల స్కోర్ చేసింది. గ్లోబల్ NCAP నివేదిక ప్రకారం.. ఈ కారులో డ్రైవర్, ప్రయాణీకులకు అందించిన హెడ్ అండ్ నెక్ ప్రొటెక్షన్ బాగానే ఉంది. అయితే డ్రైవర్ ఛాతీ రక్షణ అంతంత మాత్రంగానే ఉంది. ఇదే సమయంలో ఫ్రంట్ పాసింజర్ ప్రొటెక్షన్ సరిపోతుంది. డ్రైవర్, ప్రయాణికుల మోకాలుకు కూడా ఈ కారులో ప్రొటెక్షన్ మంచిగానే ఉన్నట్లు టెస్ట్‌లో చూపించింది.
మారుతి సుజుకి డిజైర్‌లో పిల్లల భద్రత రేటింగ్:పిల్లల భద్రతకు సంబంధించి డిజైర్ 42 పాయింట్లకు గానూ 39.20 పాయింట్లు సాధించింది. ISOFIX ఎంకరేజ్‌లను ఉపయోగించి ఇన్‌స్టాల్ చేసిన 3 ఏళ్ల పిల్లల కోసం ఫార్వర్డ్-ఫేసింగ్ చైల్డ్ సీటు, ఫ్రంటల్ తాకిడి సమయంలో అధిక ఫార్వర్డ్ మోషన్‌ను నిరోధించగలిగింది. తల, ఛాతీకి పూర్తి రక్షణను అందిస్తుంది. కానీ మెడకు ఈ కారులో లిమిటెడ్ ప్రొటెక్షన్ ఉన్నట్లు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో తేలింది.