Samsung Galaxy S25 Edge: శాంసంగ్ ఇటీవలే 'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్ పేరుతో తన కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ సిరీస్‌లో కంపెనీ 'గెలాక్సీ S25', 'గెలాక్సీ S25 ప్లస్', 'గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా' అనే మూడు మోడల్స్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025' ఈవెంట్‌లో ఈ మూడు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ఫోన్లను ప్రారంభించింది. అంతేకాక శాంసంగ్ ఈ కార్యక్రమంలో మరో కొత్త ఫోన్‌ను కూడా త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది.
గత కొన్ని నెలలుగా 'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్‌తో పాటు 'గెలాక్సీ S25 స్లిమ్' పేరుతో స్పెషల్ ఎడిషన్ కూడా వస్తుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కంపెనీ మాత్రం ఈ ఈవెంట్‌లో తన 9 ఏళ్ల లైనప్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. శాంసంగ్ 'గెలాక్సీ S25 ఎడ్జ్' పేరుతో ఈ అప్‌కమింగ్ ఫోన్‌ను టీజ్ చేసింది. అయితే తాజాగా ఇప్పడు ఈ ఫోన్ గీక్‌బెంచ్ డేటాబేస్ వెబ్‌సైట్‌లో కనిపించింది.
శాంసంగ్ ఈ 'గెలాక్సీ S25 ఎడ్జ్' యూరోపియన్ ఎడిషన్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో SM-S937B మోడల్ నంబర్‌తో ఉంది. దీని ద్వారా ఈ ఫోన్ గురించి కొత్తగా కొంత ప్రత్యేక సమాచారం వెల్లడైంది. గీక్‌బెంచ్ లిస్ట్ ప్రకారం శాంసంగ్ ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ ఉపయోగించొచ్చని తెలుస్తోంది.
'శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్' చిప్‌సెట్: గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో ఈ ఫోన్ చిప్ పేరు వెల్లడించలేదు. అయితే అందులో ఉన్న CPU, GPU వివరాల ప్రకారం కంపెనీ ఈ అప్‌కమింగ్ ఫోన్‌ను ఏ చిప్సెట్తో తీసుకురానుందో ఒక అంచనాకి రావచ్చు. వాస్తవానికి ఈ చిప్‌సెట్ 4.47GHz క్లాక్ వద్ద రెండు ప్రైమ్ CPU కోర్లతో వస్తుంది. అదే సమయంలో 6 పెర్ఫార్మెన్స్ కోర్లు 3.53GHz క్లాక్‌లో నడుస్తాయి. కంపెనీ తన లేటెస్ట్ 'గెలాక్సీ S25 అల్ట్రా' ఫోన్లో ఇదే చిప్‌సెట్ కాంబినేషన్‌ను ఉపయోగించింది. దీంతో అల్ట్రా మోడల్ మాదిరిగానే శాంసంగ్ తన అప్‌కమింగ్ 'గెలాక్సీ S25 ఎడ్జ్'లో కూడా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను అందించొచ్చని తెలుస్తోంది.
ఇది సింగిల్-కోర్ టెస్ట్‌లో 2806, మల్టీ-కోర్ టెస్ట్‌లో 8,416 స్కోర్ చేసింది. ఇది కాకుండా ఈ అప్‌కమింగ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ One UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావచ్చని గీక్‌బెంచ్ లిస్ట్ ద్వారా తెలుస్తోంది.
'శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్' స్పెసిఫికేషన్స్ (అంచనా): శాంసంగ్ ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటికే చాలా లీక్స్ వచ్చాయి. వాటి ప్రకారం ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల S-AMOLED LTPO స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రావచ్చు. ఇది కాకుండా కంపెనీ ఈ ఫోన్లో 3900mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు. ఇక ఈ ఫోన్ 12GB RAMతో 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుందని టెక్ నిపుణుల అంచనా.
కంపెనీ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఈ అప్‌కమింగ్ 'గెలాక్సీ S25 ఎడ్జ్' వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని కన్ఫార్మ్ చేసింది. ఈ ఫోన్లోని డ్యూయల్ కెమెరా సెటప్‌కు సరిపోయేలా కంపెనీ ఓవల్ ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ మందం కూడా 5.84mm ఉంటుందని అంచనా. ఇదే జరిగితే ఇది అల్ట్రా-స్లిమ్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది.
హై మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటీ లాంఛ్- ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ!
'స్టార్ట్ బిల్డింగ్ టుడే'- గూగుల్ అతిపెద్ద వార్షిక ఈవెంట్ డేట్ ఫిక్స్!
జియో నుంచి చీపెస్ట్ ప్లాన్ మళ్లీ వచ్చేసిందోచ్- అన్లిమిటెడ్ కాలింగ్, డేటా ప్రయోజనాలతో ఇక పండగే!