Trinayani Serial chandrakanth and Pavitra: బుల్లితెర జోడీ అకాల మరణం తెలుగు ప్రేక్షకుల హృదయాలను కలిచివేసింది. నటుడు చంద్రకాంత్ (chandrakanth), నటి పవిత్రా జయరాం (pavithra_jayram_) జీ టీవీలో ప్రసారం అయ్యే ‘త్రినయని’(Trinayani serial)తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంటుంది. ఈ జోడీ నాలుగు రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం టీవీ ప్రేక్షకులకు విషాదం మిగిల్చింది. సహనటి పవిత్రా జయరాం మృతిని తట్టుకోలేక నటుడు చంద్రకాంత్ గత రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు.
బుల్లితెరలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌లోనే బలవన్మరణానికి ఒడిగట్టారు. ‘త్రినయని’(Trinayani serial)తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. చంద్రకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా ఆ దంపతులు దూరంగా ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితమే త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు వెళ్లారు. అయితే బెంగళూరు నుంచి కారులో తిరిగివస్తుండగా మహబూబ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పవిత్రా జయరాం మరణించారు. ఈ ప్రమాదంలో చంద్రకాంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పవిత్రా జయరాం చనిపోవటంతో చంద్రకాంత్ మానసికంగా కుంగిపోయారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్డు నెంబర్ 20లో ఉన్న అపార్టుమెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడిలో ఉన్న చంద్రకాంత్‌కు స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో వారు ఫ్లాట్‌కు వచ్చి చూసి చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అటు సహ నటి పవిత్రా జయరాం (Pavitra Jayaram) మహబూబ్‍నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. సీరియల్ షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె, శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను తాకి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన పవిత్రకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కానీ ఆమె అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.