YSRCP Office at Occupied Sites in Peddapadu :శ్రీకాకుళం జిల్లా సిక్కోలు వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణాలకు అనుమతులు లేవు అనుకునే లోపే ఇళ్ల స్థలాలను ఆక్రమించి కట్టేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కన ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణ వ్యవహారంపై గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు చేతులెత్తేశారు. ఇప్పటికైనా కబ్జాకి గురైన భూమిపై న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనుమతులు లేవని నోటీసులు :శ్రీకాకుళం జాతీయ రహదారిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామంలోని సర్వే నెంబరు 44లో ఎకరా 50 సెంట్లు ప్రభుత్వ భూమిని 2022 సంవత్సరం మే 18వ తేదీన 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎకరాకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు లీజుకు తీసుకున్నట్లుగా జీవోలో పేర్కొన్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీని నిర్మాణ పనులు చేపట్టారు. అయితే భవన నిర్మాణానికి సంబంధించి శ్రీకాకుళం నగరపాలకసంస్థ నుంచి ఎలాంటి అనుమతులు లేవని నోటీసులు అంటించారు.
వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాలపై బిగుస్తున్న ఉచ్చు - NOTICES TO YSRCP OFFICES
30 సెంట్ల వరకు అక్రమణ : భవనాన్ని నిర్మించేందుకు అనుమతులు లేకపోయినా పక్కనే ఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలాన్ని సైతం ఆక్రమించేసి వైఎస్సార్సీపీ కార్యాలయ భవన ప్రహరీ గోడ నిర్మించేశారు. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం పరిస్థితి. దీనిలో వైఎస్సార్సీపీ కార్యాలయం భవన నిర్మాణానికి నగర పాలక సంస్థ ప్రణాళిక అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఇవి లేకుండానే భవన నిర్మాణాన్ని 90 శాతం పూర్తి చేశారు. దీనిపై ఎట్టకేలకు శ్రీకాకుళం నగరపాలకసంస్థ అధికారులు మంగళవారం ఉదయం అనుమతులు లేకుండా భవన నిర్మాణాన్ని ఎలా చేపడతారంటూ ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని వైఎస్సార్సీపీ కార్యాలయం స్తంభంపై నోటీసు అంటించారు.