YSRCP Govt Neglect Haj House in Kadapa :2019 ఎన్నికలకు ముందు టీటీపీ ప్రభుత్వం హయాంలో రాయలసీమ ముస్లింల కోసం కడపలో హజ్ హౌస్ నిర్మిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి దాన్ని పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు కడప హజ్ హౌస్‌ను వినియోగంలోకి తెస్తానని ప్రకటించడంపై ముస్లిం సోదరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తవుతున్నాయి. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని సీఎం ప్రకటించడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలు వచ్చే ఏడాది కడప నుంచే హజ్ యాత్రకు వెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఏటా లక్షల మంది రాష్ట్రం నుంచి మక్కాకు వెళ్లడానికి ముస్లింలు హజ్ యాత్ర చేపడతారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ తర్వాత రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలకు కేంద్రంగా కడపలో హజ్ హౌస్ నిర్మించాలని 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఫలితంగా కడప శివారులోని చెన్నూరు వద్ద 40వ నంబరు జాతీయరహదారి పక్కన 28 కోట్ల రూపాయల వ్యయంతో 13 ఎకరాల్లో హజ్ హౌస్ నిర్మించారు. 2019 మార్చి 6న అప్పటి మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ జిల్లా అధికారుల సమక్షంలో కడప హజ్ హౌస్ ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ నిర్మాణాన్ని అటకెక్కించింది.
మహారాజ ఆసుపత్రికి మహర్దశ - హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు - Good Facilities on Hospital
కరోనా సమయంలో ఏడాది పాటు హజ్ భవనాన్ని ఉపయోగించిన జిల్లా యంత్రాంగం అసలు లక్ష్యాన్ని మాత్రం విస్మరించింది. ఈ భవనం నిరుపయోగంగా మారడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. 2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశలు పెట్టుకున్న ముస్లింలకు సీఎం చంద్రబాబు ఈ నెల 23న శుభవార్త చెప్పారు. కడప హజ్ హౌస్‌ను త్వరలోనే వినియోగంలోకి తెచ్చే విధంగా వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడంపై ముస్లింలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.