Projects Repairs Ignored in YSR District : తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఏపీలోని జలాశయాల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మూడేళ్ల కిందట అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన విషాధ ఘటనను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. 2021 నవంబర్ 19న సంభవించిన భారీ వరదలకు తోడు వైఎస్సార్సీపీ నాయకుల స్వార్థపూరిత ఆలోచనలతో పింఛ, అన్నమయ్య జలాశయాలు కొట్టుకుపోయాయి.
Irrigation Projects in AP :తెల్లారకముందే ఐదూర్లు నేలమట్టం అయ్యాయి. 38 మందిని బలితీసుకున్న విషాద ఘటన అది. ఘటన జరిగిన తర్వాత మూడేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేయలేకపోయింది. పునరావాసం మాట దేవుడెరుగు ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలోని మరికొన్ని జలాశయాల పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది.
YSRCP Govt on Projects Repairs :జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం జలాశయం పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడం, గేట్ల పైభాగం, వంతెన పూర్తిగా దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే కాకుండా బద్వేల్ నియోజకవర్గంలోని దిగువ సగిలేరు గేటు కొట్టుకుపోయి ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి ప్రాజెక్టు స్పిల్ వే దెబ్బతింది. చాలావరకు కోతకు గురైంది.
ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ :కమలాపురం నియోజకవర్గంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిస్థితి మరింత ఘోరం. ప్రాజెక్టు నాణ్యతా లోపం కారణంగా ఎక్కడ చూసినా లీకేజీలే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం అయితే సమీపంలోని గ్రామంలోకి నీళ్లు చేరుతున్నాయి. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల మరమ్మతులపై అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. గత ఐదేళ్లలో వీటికి ఎన్ని నిధులు కేటాయించారు వాటిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.