Arrangements For Prabhala Theertham at Konaseema District : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి వేళ కనుమ రోజున అత్యంత వైభవంగా ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నిర్వహించే తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశ రుద్రులు కనుమ రోజు ఇక్కడ కొలుదీరుతారని ప్రతీతి. ఈసారీ వైభవంగా ప్రభల తీర్థం నిర్వహించేందుకు కోనసీమ వాసులు సిద్ధమయ్యారు.
జిల్లాలో కనుమ ప్రభల ఉత్సవాలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 170 చోట్ల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గంగలకుర్రులోని పార్వతీసమేత చెన్న మల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారంలోని ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారి ప్రభలు స్థానికంగా ఉన్న అప్పర్ కౌశకి నది దాటి వచ్చే సన్నివేశాలను భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తారు.
కనుమ అంటేనే కోనసీమ - ప్రభల తీర్థంపై ప్రధాని మోదీ లేఖ
అంబాజీపేట మండలం వాకల గురువు, తొండవరం, గున్నేపల్లి అగ్రహారం ప్రభలు రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలుగా గుర్తింపు పొందాయి. జగ్గన్నతోటలో నిర్వహించే ఉత్సవం జిల్లాలోనే పేరొందింది. కొత్తపేటలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రభల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభలను అలంకరించి యువత భుజాలపై మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కన్నులపండవగా కోనసీమ ప్రభలతీర్థాలు - భారీగా తరలివచ్చిన భక్తజనం