Huge Cockfight Competitions in Godavari District : సంక్రాంతిని పురస్కరించుకుని వరుసగా రెండోరోజు జోరుగా కోడిపందేలు సాగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. సినీసెట్టింగ్‌లను తలదన్నే రీతిలో ఏర్పాట్లు, ప్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించారు. వీఐపీలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జూదంలోనూ కోట్లాది రూపాయలు చేతులు మారాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందేల జోరు కొనసాగుతోంది. రాజమహేంద్రవరం శివారు పిడింగొయ్యి వద్ద రెండు పెద్దబరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. కొవ్వూరు గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లోనూ జోరుగా పందేలు సాగాయి. కోనసీమలోని అన్ని మండలాల్లో భారీస్థాయిలో పందేలు నిర్వహించగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ముమ్మడివరం మండలం మురమళ్లలో భారీ పందేలు నిర్వహించారు. ఎమ్మెల్యేల దాట్ల బుచ్చిబాబు, ఎంపీ హరీష్‌మాధుర్ పందేలు వీక్షించారు. మహిళలు, చిన్నారులు సైతం ఈ పందేలు తిలకించేందుకు తరలివచ్చారు. కోడిపందేల శిబిరాల వద్దే పేకాట, గుండాటలు జోరుగా సాగాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ రెండోరోజూ కోడి పందాల జోరు కొనసాగింది. తొలిరోజును మించి రెండో రోజు కోళ్లు కత్తులు దూశాయి. పందెం రాయుళ్లు రెట్టించిన ఉత్సాహంతో పందేలు కాస్తూ సందడి చేశారు. దారులన్నీ బరులవైపే అన్నంతలా నగర వాసులంతా గ్రామాల బాట పట్టగా బరుల వద్ద కోలాహలం నెలకొంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం దొరమామిడి, కంసాలికుంట, రెడ్డిగణపవరం, అంతర్వేదిగూడెం, బుట్టాయగూడెం గ్రామాల్లో జోరుగా కోడిపందాలు సాగాయి. చాట్రాయి మండలం చనుబందలో ఆరు కోడి పుంజులతో ఒకేసారి పందెం కాయగా విజేతకు బుల్లెట్ వాహనాన్ని బహుమతిగా ఇచ్చారు. దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం, దెందులూరు, పెదపాడు మండలం, పెదవేగి మండలాల్లో తీర్థాలను తలపించేలా కోడి పందాల బరులు కనిపించాయి.
కాళ్ల మండలంలోని పెద అమిరం, మాలవానితిప్ప, కాళ్లకూరు, కాళ్ల, ఉండి మండలం మహదేవపట్నం, కోలమూరు, పాములపర్రు, ఎండగండి, చెరుకువాడ, ఆకివీడు మండలం ఆకివీడు ఐ.భీమవరం, దుంపగడప గ్రామాల్లో కోడి పందేలు భారీగా నిర్వహించారు.
తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పందుల పందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెరవలి మండలం ఖండవిల్లిలోగుండాటలో డబ్బులు పోయాయని ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కత్తి కట్టొద్దని పోలీసులు హెచ్చరించినా పందెం రాయుళ్ల పంతమే నెగ్గింది
విజయవాడ పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతుండగా వీటిని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్దఎత్తున తరలివస్తున్నారు. స్నేహితులు, బంధువుల ఆహ్వానం మేరకు కొందరు రాగా మరికొంత మంది కోడిపందేలను చూసి పైపందేలు కాయడానికే వచ్చి హోటళ్లలో ఉంటున్నారు. మహిళలు సైతం పందేలు తిలకించేందుకు పెద్దఎత్తున బరుల వద్దకు వస్తున్నారు. విజయవాడ శివారు ఎనికేపాడు, అంబాపురంలో జోరుగా పందేలు సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి.
కంకిపాడులోనూ బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో జోరుగా కోడిపందేలతోపాటు కోతముక్క ఆటలు నిర్వహించారు. బరులు వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గండేపల్లిలో కోడిపందేల బరుల వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన పసుపులేటి కుమార్ తోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి.