Stone Lifting Competitions in AP : రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి శోభ నెలకొంది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగవల్లులలో గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు, పూలు చల్లారు. బంధువులంతా ఒక్కచోట చేరి పిండివంటలు, విందు భోజనాలతో ఉత్సాహంగా గడిపారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలతో చిన్నాపెద్ద ఉత్సాహంగా గడిపారు. పండగ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సంక్రాంతి వేడుకల్లో భాగంగా పలుచోట్ల గుండురాయి ఎత్తు పోటీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేశారు. జలుమూరు మండలం కరవంజ గ్రామంలో గుండురాయి ఎత్తు పోటీలు స్థానికులను అలరించాయి. జిల్లా నలుమూలల నుంచి వస్తాదులు గుండురాయిని ఎత్తి తమ బలాన్ని ప్రదర్శించారు. అనంతరం విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
Sankranti Celebrations in AP 2025 : బాపట్ల జిల్లా చీరాల మండలం సవరపాలెంలో గుండురాయి పోటీలు నిర్వహించారు. 50 కిలోల బరువైన రాతి గుండును ఎక్కవసార్లు భుజం పైకెత్తుకున్న వారిని విజేతలుగా ప్రకటించారు. శ్రీ కృష్ణా యూత్ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రాచీన క్రీడలను నేటితరానికి తెలియచేసేందుకు ఏటా సంక్రాంతి వేడుకల్లో గుండురాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
సందడిగా గ్రామీణ ప్రాంతాలు - కోడిపందేల్లో చేతులు మారుతున్న కోట్లు