Visakha Regional Tourism Summit : విశాఖలో సోమవారం నాడు నిర్వహించిన ఒకరోజు ప్రాంతీయ స్థాయి పర్యాటక సదస్సుకు ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న సంస్ధలు, వ్యక్తులు హాజరయ్యారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరై ఉత్తరాంధ్రలో పర్యాటక రంగంపై తన అనుభవాలను వివరించారు. వినోదరంగంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ప్రయత్నించాలని చెప్పారు.
వనరులు సరిగా వాడుకుంటే పర్యాటకంగా ఏపీకి మంచిపేరు వస్తుందని సూచించారు. పర్యాటక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో పెట్టుబడులకు పలువురు ఔత్సాహికులు ముందుకురాగా వారితో ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది.
"రాష్ట్రంలో పర్యాటక రంగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కొన్ని సడలింపులు ఇవ్వాలి. కఠినమైన నిబంధనలను సులభతరం చేయాలి అనుమతులిచ్చే విషయంలో వేగం పెంచాలి. ఇక్కడ ఉన్న వనరులను సరిగ్గా వినియోగించుకోగలిగితే పర్యాటకంగా రాష్ట్రానికి మంచి ప్రాచుర్యం వస్తుంది." - చింతకాయల అయన్నపాత్రుడు, స్పీకర్
Kandula Durgesh on Tourism Policy : రాష్ట్ర పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పీ4 మోడల్ ఈ రంగానికి మరింత పరిపుష్టం చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించగలిగే ఈ రంగంలో చొరవ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా రాణించే అవకాశం ఉందన్నారు. టూరిజంలో రాబోయే 5 ఏళ్లలో ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో పర్యాటక రంగం అభివృద్ధిలో కుంటుపడిందని ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఆరోపించారు. నూతన టూరిజం పాలసీ తెచ్చి దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే విజయవాడలో ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించామని పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెండో సమ్మిట్ విశాఖలో నిర్వహిస్తున్నామని చెప్పారు.
భవిష్యత్‌లో ఒకే ఒక ఇజం ఉంటుందని అదే టూరిజమని అన్నారు. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేద్దామని ఆయన వివరించారు. ఈ సదస్సులో కలెక్టర్లు హరీంద్రప్రసాద్, దినేశ్‌కుమార్, విజయ్ కృష్ణన్లు ఉత్తరాంధ్రలో పర్యాటకంగా అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. ఈ సదస్సులో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకరంగంలో 25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
గోదారి జలసవ్వడుల నడుమ.. రుచులను ఆస్వాదిస్తూ..! రాజమహేంద్రవరంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్