Rushikonda Palace : ఆ భవనాల ప్రధాన ద్వారానికి పెట్టిన తలుపు ఖర్చు (గ్రిల్‌తో సహా) ఎంతో తెలుసా రూ. 31,84,247. బాత్‌రూమ్‌లో అమర్చిన వాల్‌మౌంటెడ్ కమోడ్ ధర అక్షరాలా రూ. 11,46,840. బాత్‌రూమ్‌లో ఒక్కో షవర్‌కి పెట్టిన ఖర్చు రూ.44,640 పైమాటే. ఇదంతా ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన బ్రునై సుల్తాన్ ఇంటికి పెట్టిన ఖర్చు కానే కాదు.
వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ నివాసం కోసం విశాఖలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్‌లో పెట్టిన ఖర్చు. రూ.409.39 కోట్లు. ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి నిర్మించిన ఆ భవనాల్లో బాత్‌టబ్‌లు, షవర్లు, కమోడ్‌లు, తలుపులు తదితరాలకు పెట్టిన ఖర్చు చూస్తే సామాన్యుల కళ్లు తిరిగిపోతాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ ఖర్చుతో డబుల్ బెడ్‌రూమ్ కొనొచ్చు :రుషికొండ ప్యాలెస్‌లో వాడిన ఒక బాత్ టబ్, కమోడ్, ప్రధాన తలుపు ఖరీదుతో విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో కుటుంబానికి అవసరమైన డబుల్ బెడ్ రూం ఫ్లాట్ వచ్చేస్తుంది. ప్రధాన డోర్‌లకు రూ.31.84 లక్షలు చొప్పున ఖర్చు చేశారు. ఇతర తలుపులు ఒక్కోదానికి రూ.17,93,658 చొప్పున వెచ్చించారు. బాత్‌రూమ్‌లలోని ఒక్కో బాత్‌టబ్‌కి పెట్టిన ఖర్చు రూ.12,38,771. ఒక్కో వాష్‌బేసిన్‌కి పెట్టిన ఖర్చు రూ.2,61,500.