Vallabhaneni Vamsi Arrest in Hyderabad : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఉన్న ఆయన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి విజయవాడ భవానీపురం పీఎస్‌కు తరలించిన పోలీసులు అక్కడ నుంచి మరో వాహనంలో వంశీని కృష్ణలంక పీఎస్‌కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్న సత్యవర్ధన్‌ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని వంశీపై ఫిర్యాదు నమోదైంది. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు.
వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్న సమయంలో చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో నందిగామ వద్ద వంశీ భార్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వల్లభనేని వంశీ భార్యతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ ఉంది. పోలీస్ ఎస్కార్ట్ తో ఆమెను హైదరాబాదుకు పంపించారు.
ట్విస్ట్ మీద ట్విస్టు తో గన్నవరం పార్టీ కార్యాలయం పై దాడి కేసు లో సీన్ రివర్స్ అయింది. ఫలితంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ నివాసంలో అరెస్ట్ చేసే సమయంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. రాయదుర్గం సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో వంశీ ఉన్నారని తెలుసుకుని విజయవాడ పటమట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వంశీ ఉండే ప్లాట్‌లోకి వెళ్లి అరెస్ట్ విషయాన్ని ఆయనకు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు సమాచారం ఇచ్చారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ కొద్దిసేపు పోలీసులతో ఆయన వాదనకు దిగారు. గన్నవరం కేసులో కోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
దాడి కేసులో కాదు మిమ్మల్ని ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు చేస్తున్నామంటూ అరెస్టు వారెంట్ చూపారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసు మీ నమోదైందని మాతో రావలంటూ వంశీకి పోలీసులు స్పష్టం చేశారు. దీంతో డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పడంతో పోలీసులు అంగీకరించారు. డ్రెస్ మార్చుకుని వస్తానన్న వంశీ చాలాసేపటివరకు బయటకు రాలేదని తెలుస్తోంది. ఈలోపు అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారనే విషయాన్ని కొందరు వైఎస్సార్సీపీ నాయకులు, అనుచరులకు వంశీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు గంట సేపు ఆయన బెడ్ రూమ్ నుంచి బయటకు రాలేదు. వంశీ అరెస్టు సమాచారాన్ని ఏపీ పోలీసులు ముందస్తుగానే రాయదుర్గం పీఎస్‌కు సమాచారం ఇచ్చారు. వంశీపై ఉన్న కేసు వివరాలను రాయదుర్గం పోలీసులకు తెలిపారు. అనంతరం వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
వంశీ లెక్కలు తేల్చేందుకు సిద్ధమైన సర్కార్! - అరాచకాలపై కూలంకషంగా దర్యాప్తు
సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు . ఆ తర్వాత సత్యవర్ధన్‌ను బెదిరించి, దాడులకు తెగబడ్డాడని, కిడ్నాప్ చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. వంశీపై BNS సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. వల్లభనేని వంశీపై పటమట పీఎస్‌లో మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్, మరో మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. 86/2025, 84/2025 అనే నెంబర్లతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నెం.86/2025తో నమోదైన కేసులో వంశీ అరెస్టు అయ్యారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. ఆయన నేరుగా దాడి చేయనప్పటికీ ఈ ఘటన వెనుక ఆయన ప్రోద్భలం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని అరెస్ట్ చేసి చేశారు. వీరిలో వంశీ పీఏ రాజా కూడా ఉన్నారు. 2023 ఫిబ్రవరి 20న వైసీపీ శ్రేణులు జరిపిన దాడులు, సాగించిన విధ్వంసకాండపై అప్పటి పోలీసులు నామమాత్రపు కేసు కట్టి చేతులు దులిపేసుకున్నారు.
కూటమి ప్రభుత్వం రావడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టారు.వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో తెదేపా నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏ2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు కూడా ఉంది.
గన్నవరం మాజీ పీఏసీఎస్ (PACS) అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో ఇప్పటికే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నారు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చింది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - వల్లభనేని వంశీ అనుచరుల అరెస్టు