Facilities in Visakha KGH : ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య సంజీవని కింగ్ జార్జ్ హాస్పిటల్. వందేళ్ల ఘన చరిత్ర ఉన్న కేజీహెచ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే రోగులకూ వైద్య సేవలందిస్తోంది. కూటమి పాలనలో ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్యసేవలు మెరుగయ్యాయి. ప్రస్తుతం ఓపీ, క్యాజువాలిటీ వార్డులను విస్తృతం చేయడంపై దృష్టి సారించారు. ఈ ఆసుపత్రి 57 ఎకరాల్లో విస్తరించి ఉంది. మొత్తం 54 బ్లాకుల్లో 34 విభాగాలు రోగులకు సేవలందిస్తున్నారు.
ఆసుపత్రికి రోజుకు సగటున రోజుకు సుమారు రెండున్నర వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. రద్దీ సమయాల్లో ఈ సంఖ్య మూడున్నర వేల వరకు ఉంటుంది. 1500ల పడకల సామర్థ్యంతో రోగులకు సేవలందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు డయాలసిస్ కేంద్రంలోనూ రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. కేజీహెచ్‌కు అనుబంధంగా ఆంధ్ర మెడికల్ కళాశాల నడుస్తోంది. గత వైఎస్సార్సీపీ హయాంలో ఆసుపత్రి అభివృద్ధి నిలిచిపోయాయి. కానీ కూటమి పాలనలో ప్రత్యేక దృష్టి సారించి నూతన భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు.
Vizag KGH Medical Services : ఆసుపత్రికి వచ్చే రోగులు అభా ఆప్‌లో పేర్లు నమోదు చేసుకుని సంబంధిత విభాగ వైద్యుల సేవలు పొందుతున్నారు. ఓపీలు అధికంగా ఉండటంతో వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంటోందని మందులు ఇచ్చే కౌంటర్లు పెంచాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. పేషెంట్స్‌కు ఒక్కరూపాయీ ఖర్చు లేకుండానే ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ విధానాన్నీ పటిష్టంగా అమలు చేస్తున్నారు.
వైద్యసేవలు బాగున్నాయి. ఓపీ దగ్గర సమయం పడుతుంది. డాక్టర్లు చాలా బాగా చూస్తున్నారు. మందులు ఇచ్చే కౌంటర్లు పెంచాలి. ఆసుపత్రిలో పరిశుభ్రత బాగుంది. త్రాగునీరు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి వసతి కల్పించాలని కోరుతున్నాం. - రోగులు
ఇన్ పేషంట్లకు నాణ్యమైన భోజనం సరఫరా చేస్తున్నారు. 54 విభాగాల్లో రోగులకు నిరంతరం సేవలు పొందే సౌకర్యాలుఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియపై దృష్టి సారించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. అవినీతి రహతంగా వైద్య సేవలందించడంతో పాటు నిరంతరం సీసీకెమెరాల పర్యవేక్షణతో రోగులకు భద్రత కల్పిస్తున్నారు.
"అభా అనేది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. మీరు అందులో నమోదైతే మీ వివరాలు కనిపిస్తాయి. మీకు సంబంధించిన వైద్యసేవలు, మీరు వాడే మందులు వివరాలన్నీ ఉంటాయి. అభా నంబర్ ఉంటే భారతదేశం మొత్తం ఎక్కడైనా వైద్య సేవలు పొందొచ్చు. ఇందులో భాగంగానే ఆసుపత్రికి వచ్చే రోగుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియపై దృష్టి సారించాం." - డాక్టర్ శివానంద, విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్
మహారాజ ఆసుపత్రికి మహర్దశ - హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు - Good Facilities on Hospital
'వైద్యులు సమయానికి రాకున్నా - రోగులను పట్టించుకోకపోయినా చర్యలు'