Rayanapadu Railway Gate Problems : ఎందరో ప్రయాణికుల ఎదురుచూపులకు తెరదించుతూ పట్టాలపై కూత పెడుతూ వచ్చే రైలు వాహనదారుల సహనానికి మాత్రం పరీక్షలు పెడుతోంది. రైలు వచ్చిపోయే వేళల్లో తరచుగా గేటు వేయడంతో ఎండలో గంటల తరబడి దుమ్ము, ధూళి మధ్య వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ శివారులోని రాయనపాడు రైల్వే గేటు సమస్యతో అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు గ్రామం మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ వెళ్తుంది. ఒకసారి గేటు పడితే గ్రామానికి రెండుపక్కల ప్రజలు ఎక్కడిక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు వెళ్లే సమయంలో పావుగంట నుంచి అరగంట వరకు వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైడూరుపాడు, కవులూరు, జి.కొండూరు, మైలవరం తదితర ప్రాంతాల ప్రజలు రాయనపాడు మీదుగానే ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు.
గొల్లపూడి రైల్వే ట్రాక్ వైపూ వాహనాల రాకపోకలు పెరిగాయి. గొల్లపూడి నుంచి జక్కంపూడి, షాబాదతో పాటు కొత్తూరుతాడేపల్లి వెళ్లే వెహికల్స్ ఎక్కువగా ఆ మార్గంలో వెళ్తున్నాయి. పగటి పూట విజయవాడ నగరంలోకి టిప్పర్లు, భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. ఆ వాహనాలన్నీ గొల్లపూడి రైల్వే గేటు మీదుగా వస్తున్నాయి. దీంతో గేటు పడిందంటే చాలు వెహికల్స్ భారీగా నిలిచిపోతున్నాయి. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా విపరీతంగా ఉంటోందని వాహనదారులు చెబుతున్నారు. వైద్యచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
" ఈ మార్గంలో నిత్యం పదుల సంఖ్యలో రైలు తిరుగుతుంటాయి. ఒక్కోసారి గేటు పడితే అరగంట వరకు వేచిచూడాలి. ట్రాఫిక్‌జాం కూడా బాగా పెరిగిపోతోంది. అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం, అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని కోరుతున్నాం". - వాహనదారులు
Pending in Rayanapadu Gate Issue : గొల్లపూడి, రాయనపాడు రైల్వేట్రాక్ వద్ద పైవంతెనల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి. వంతెనల నిర్మాణానికి అంచనాలు వేయడంతోనే అధికారులు సరిపెడుతున్నారు. ట్రాఫిక్ సమస్య ఏటా పెరుగుతున్నా రైల్వే గేటు సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నో గ్రామాలను కలిపే కీలక రహదారిపై రైల్వే పైవంతెనను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దిశగా రాష్ట్రప్రభుత్వం, రైల్వే అధికారులు దృష్టి సారించాలని వేడుకుంటున్నారు.
గుణదల రైల్వేఓవర్ బ్రిడ్జి- విడుదల ఎప్పుడు?! 15 ఏళ్లు గడచినా నెరవేరని కల