Penna River Water Polluted with Waste And Garbage Nellore District : నెల్లూరు నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో పెన్నానది మురికి కూపంలా మారుతోంది. లక్షలాది మందికి తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందించే నదీజలాల్లో మురుగు నీటితో పాటు చెత్తాచెదారం నింపి కలుషితం చేస్తున్నారు. పశువుల కళేబరాలతో పాడు చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉండాల్సిన నదీతీర ప్రాంతంలో దుర్వాసనతో ముక్కులు మూసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు.
నెల్లూరు నగరానికి పెన్నానది ఓ ఆభరణం. లక్షలాది మందికి తాగు, సాగునీరు అందిస్తున్న పెన్నానది నగరం చుట్టూ విస్తరించి ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. నగరపాలక సంస్థగా రూపాంతరం చెందినప్పటికీ నెల్లూరులో ఇప్పటికీ చెత్తా చెదారం పడేయడానికి సరైన డంపింగ్ యార్డు లేదు.
దీంతో పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్లతో చెత్తను తీసుకొచ్చి నది తీరంలో పడేస్తున్నారు. అలాగే కాలనీల్లోని మురుగు నీరంతా నేరుగా పెన్నానదిలోకే వదిలేస్తున్నారు. నగరపాలక సంస్థ సిబ్బందే నేరుగా చెత్తను నదిలో పడేస్తుండటంతో ప్రైవేట్ వ్యక్తులు సైతం మాంసం వ్యర్థాలు, చనిపోయిన పశువుల కళేబరాలు నదిలో పారబోస్తున్నారు. దీంతో ఆహ్లాదకరంగా ఉండాల్సిన పెన్నానదీ తీరం దుర్వాసనలతో కంపుకొడుతోంది.
డ్రైనేజీ, వ్యర్థాలతో కాలుష్య కోరల్లో చిక్కుకున్న పెన్నమ్మ! - PENNA RIVER POLLUTE
'నెల్లూరు నగరంలోని చెత్తను అంతా తీసుకోచ్చి పెన్నా నదిలో వేస్తున్నారు. దీంతోపాటు పచ్చి మాంసం, కలేబరాలు ఇక్కడే వేస్తున్నారు. అంతటితో ఆగకుండా దాన్ని కాల్చేస్తున్నారు. ఆహ్లాదంగా ఉండాల్సిన పెన్నా తీరం నగర పాలక సంస్థ నిర్లక్ష్యం వల్ల దుర్వాసన వెదజల్లుతుంది.' - స్థానికులు
నదిలో చెత్తను వేయడమేగాక మంటపెడుతుండటంతో పొగ ఇళ్లను కమ్మేస్తోందని పరిసర ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు సైతం ఇబ్బందిపడుతున్నారు. రసాయనాలతో కూడిన పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోడిగాడి తోట, జాకీర్‌హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, మైపాడురోడ్డు ప్రాంతవాసులు ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు.పెన్నానది పూర్తిగా కలుషితమవుతున్నా నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.