Jagananna Colonies Irregularities in AP : జగన్ పాలనలో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట వైఎస్సార్సీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. కాకినాడ జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములను రైతులకు కౌలుకిచ్చి లక్షల్లో దండుకుంటున్నారు. ఇండ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో అనధికారికంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. కాకినాడలో జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్లు నిర్మించేందుకు గత ప్రభుత్వం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి వద్ద అన్నదాతల నుంచి భూములు కొనుగోలు చేసింది.
సముద్రం ఎదురుగా కొమరగిరి-1 లేఅవుట్లో 300 ఎకరాల భూమిని కొని మెరక చేశారు. స్థలాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో కొందరు లబ్ధిదారులు పునాదుల వరకు నిర్మించి వదిలేశారు. కొమరగిరి-2 లేఅవుట్లో 70 ఎకరాలు కొని వాటిలో 40 ఎకరాలను మెరక చేశారు. ఇక్కడ ఎకరా భూమి రూ.30 లక్షలు ఉంటే రూ.52 లక్షల చొప్పున చెల్లింపులు చేశారనే ఆరోపణలున్నాయి.
Komaragiri Jagananna Colony Issue : కొమరగిరి-2 లేఅవుట్లో మిగిలిన 30 ఎకరాల్లో వైఎస్సార్సీపీ నేతలు దందాకు తెరలేపారు. ఖాళీ భూముల్ని పంట పొలాలు వేసుకునేందుకు ఎకరాకు రూ.30,000ల చొప్పున రైతులకు కౌలుకిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ తతంగాన్ని స్థానిక ఎమ్మెల్యే వనమూడి కొండబాబు సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. అన్నదాతల నుంచి కౌలు సొమ్ము వసూలు చేస్తున్న నాయకులకు రెవెన్యూ అధికారుల అండదండలున్నాయని ఆరోపణలున్నాయి.
ఈ భూములు స్వాధీనం చేసుకుంటున్నామని గతంలో కాకినాడ ఆర్డీవోగా పనిచేసిన కిషోర్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆయా భూముల్లో యథేచ్ఛగా వరి సాగు చేస్తున్నారు. పంట పూర్తయిన తర్వాత భూమి స్వాధీనం చేసుకుంటామని కాకినాడ ఆర్డీవో మల్లిబాబు చెబుతున్నారు. కొమరగిరి -1, కొమరగిరి -2 లేఅవుట్ల కోసం కొనుగోలు చేసిన భూముల ధరలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో అక్రమాల గుట్టు నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.
"కొమరగిరి గ్రామపంచాయతీలో లబ్ధిదారుల కోసం భూమిని సేకరించాం. అందులో 70 శాతం స్థలాన్ని ఇండ్లు కట్టుకునేందుకు అనుకూలంగా చేశాం. ఇంకా 30 ఎకరాలు అలాగే ఉంది. ఆ 30 ఎకరాల్లో రైతులు పంట వేశారు. వెంటనే రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పంట సాగు చేస్తున్న రైతులను హెచ్చరించాం. ప్రస్తుతం పొలంలో పంట ఉంది. ఆ పంటను స్వాధీనం చేసుకొని వేలం వేస్తాం." - మల్లిబాబు, ఆర్డీవో
పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోన్న జగనన్న లేఅవుట్
Floods In Jagananna Colony : జలమయమైన జగనన్న కాలనీలు.. లబోదిబోమంటున్న లబ్ధిదారులు !