Review on Government Hospitals Facilities in AP : రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై నిరంతర సమీక్ష జరుగుతోందని, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న అంశాల్లో అనతి కాలంలో సానుకూలత సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. లేకుంటే ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లపై కఠిన చర్యలుంటాయన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఆయన 256 ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రుల సేవల నాణ్యతను సమీక్షించారు.
మొదటి దఫా అభిప్రాయ సేకరణ గతనెల 27న జరగ్గా, రెండవ అభిప్రాయ సేకరణ ఈ నెల 7న జరిగింది. మొత్తం ఆరు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా 5 అంశాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత మెరుగైందని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండడం, డాక్టర్ల ప్రవర్తన, సిబ్బంది ప్రవర్తన, మందుల సరఫరా, అవినీతి విషయాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని ఆయన వెల్లడించారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పందించిన రోగుల శాతం 58 నుంచి 84 శాతానికి పెరిగిందన్నారు.
డాక్టర్ల ప్రవర్తన బాగా ఉందన్న వారి సంఖ్య 65 నుంచి 82 శాతానికి, ఆసుపత్రుల్లో సిబ్బంది ప్రవర్తనను మెచ్చుకున్నవారి సంఖ్య 64 శాతం నుంచి 73 శాతానికి పెరిగినట్లు IVRS సర్వే వెల్లడించింది. ఈ సానుకూలతలపై సంతోషం వ్యక్తం చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత విషయంలో వ్యక్తమైన ప్రజాభిప్రాయం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశుభ్రత బాగా లేదన్నవారి సంఖ్య మొదటి సర్వేలో వెల్లడైన 33 శాతం నుంచి రెండో సర్వేలో 59 శాతానికి పెరిగినట్లు తెలిపారు.
మహారాజ ఆసుపత్రికి మహర్దశ - హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు - Good Facilities on Hospital