Government Appointed Special Investigation Team Prepared an Action Plan on Liquor Scam : మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. మద్యం విక్రయాలు, తయారీలో జరిగిన అవతవకలపై సీఐడీ నివేదిక, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేయనుంది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలపై దర్యాప్తు చేయాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పురోగతి నివేదికను ప్రతీ 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది.
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అక్రమాలపై 2024 సెప్టెంబరు 29న సీఐడీ నమోదు చేసిన కేసును సిట్‌కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సహా మరికొందరిపై అభియోగాలు నమోదు చేశారు. వీటన్నిటిపైనా విచారణ చేయాల్సిందిగా సిట్‌ను ప్రభుత్వం అదేశించింది. జగన్ హయాంలో మద్యం అక్రమాలకు సంబంధించి 90 వేల కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలు జరిగాయని అభియోగాలున్నాయి.
వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్ - ప్రభుత్వం ఉత్తర్వులు
ఇందులో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లలో 18 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మద్యం, బీరు బాటిళ్లకు వేసే హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్‌మాల్ జరిగినట్టుగా విజిలెన్సు విచారణలో తేలింది. వీటన్నిటిపైనా సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి తదితర సెక్షన్ల కింద సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. అప్పటి బెవరేజెస్ కార్పోరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి సహా మరికొందరిపై అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై అభియోగాలు నమోదు చేశారు.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో సీఐడీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టలరీస్‌లో తనిఖీలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించి పలుచోట్ల మద్యం బాటిళ్లు తయారు చేసినట్లు గుర్తించారు. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేయనుంది.
మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు - వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు