YSRCP Anarchists in Tirumala :తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడ నుంచో వస్తున్న సామాన్య భక్తులకు చేదు అభనుభవం ఎదురవుతోంది. ఎలాంటి టికెట్ లేకుండా తిరుమల కొండపైకి వస్తే సామాన్యులు కష్టాలు పడాల్సిందే. పోనీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మళ్లీ 3 నెలల వరకూ అవకాశం ఉండదు. కానీ, వైఎస్సార్సీపీ నాయకులు తలచుకుంటే చాలు, తిరుమలకు డైలీ సర్వీస్ కూడా చేయొచ్చు. ఐదేళ్లుగా కొండపై వాళ్ల రుబాబు అంతా ఇంతా కాదు. టీటీడీ ఛైర్మన్‌తో పాటు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్ని దర్శన టిక్కెట్లు కోరితే అన్నీ ఇవ్వాల్సిందే. మార్చి నెలలో ఒక రోజు 72,299 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే అందులో ఛైర్మన్ సిఫారసుతో ఇచ్చిన టిక్కెట్లే వెయ్యి ఉన్నాయి. ఇక కొండపై మంత్రుల మెహర్భానీ మామూలుగా లేదు.
తిరుమలకు వెళ్లేందుకు పోటీ పడిన వైఎస్సార్సీపీ నేతలు : 2019 జూన్ నుంచి 2024 ఫిబ్రవరి 29 వరకూ తిరుమల స్వామివారిని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అత్యధికంగా 23సార్లు దర్శించుకున్నారు. మంత్రి రోజా 19సార్లు, చెల్లుబోయిన గోపాలకృష్ణ 16సార్లు, తిరుపతి ఎంపీ గురుమూర్తి 14సార్లు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ 13సార్లు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 12సార్లు, ఎమ్మెల్సీ భరత్ 11 సార్లు , మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి 9సార్లు వెంకన్నను దర్శించుకున్నారు. మంత్రి రోజా ఎప్పుడు దర్శనానికి వెళ్లినా వెంట కనీసం పాతిక ముప్పై మంది ఉంటారు.
YSRCP Leaders Visits Tirumala Tirupati Devasthanam :కరోనా నియంత్రణలు కొనసాగుతున్న సమయంలోనూ అప్పటి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఏకంగా 67 మందిని వెంటేసుకెళ్లారు. ఇక నారాయణస్వామైతే ఆయన అనుచరగణానికి దర్శనాలతోపాటు అతిథి గృహంలో భోజనాలు పెట్టించాలని టీటీడీ అధికారుల్నే డిమాండ్ చేశారు. మంత్రి స్వయంగా వస్తే ఆయన వెంట 20 మంది వరకు ప్రొటోకాల్ దర్శనాలకు అనుమతి ఉంటుంది. దీన్ని బాగా వాడుకున్న కొందరు మంత్రులు ఎన్నికల ముందు రోజుల తరబడి కొండపైనే తిష్టవేసి, రోజుకి కొందరు చొప్పున అనుచరులు, మద్దతుదారుల్ని దర్శనాలకు తీసుకెళ్లారు. మార్చిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 3రోజుల పాటు కొండపై ఉండి ప్రతి రోజూ మందీమార్బలంతో దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత కొండపై రాజకీయ విమర్శలు చేసి, తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ నేతలకు లెక్కే లేదు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు
రాష్ట్రంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, పలుకుబడి పెంచుకోవడానికి, కోర్టు కేసుల నుంచిఉపశమనానికి, డబ్బులుసంపాదించడానికి తిరుమల క్షేత్రాన్ని వైసీపీ పెద్దలు కేంద్రంగా మార్చుకున్నారు. దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి వంటి కొందరిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారు. ఇక వైఎస్ కుటుంబానికి ఆత్మబంధువుగా పేరున్న వ్యక్తిని టీటీడీకి సర్వాధికారిగా నియమించారు. టీటీడీ ఈవోగా ముఖ్య కార్యదర్శి హోదాకి తగ్గని సీనియర్ అధికారిని నియమించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. దానికి మంగళం పలికిన జగన్ ఒక నాన్ ఐఏఎస్ అధికారిని జగన్ ఆ పోస్టులో కూర్చోబెట్టారు. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌లే లేరన్నట్టు దిల్లీ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి టీటీడీలో కూర్చోబెట్టారు. టీటీడీ ఉన్నతాధికారిగా ఆయన శ్రీవారికి చేసిన సేవకంటే జగన్ సేవలోనే ఎక్కువ తరించారు! పేరుకి అధికారైనా జగన్ ప్రయోజనాలు కాపాడడమే ఆ అధికారి జెండా, అజెండా! స్వామివారి దర్శనానికి వచ్చే వివిధ రంగాల ప్రముఖులకు సర్వోపచారాలు చేయడం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, జగన్‌పై కేసుల వంటి వ్యవహారాల్లో రక్షణ కల్పించడం ప్రధాన అజెండాగా చెప్తారు. జగన్ తరపున దిల్లీలో లాబీయింగ్ చేయడంలో ఆయన దిట్ట. 2019 ఎన్నికలకు ముందు తనను కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు జగన్ ఆదేశాల మేరకు ఆ అధికారే తీసుకెళ్లారని వివేకా కుమార్తె సునీత చెప్పడాన్నిబట్టే వైసీపీ విపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచీ జగన్ కోటరీలో ఆయన ఎంత కీలక వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు.
కొండపై ఆ అధికారి చెప్పిందే వేదం! చేసిందే శాసనం: అర్చకులు సహా ప్రతి ఒక్కరికీ ఆయనంటే హడల్. నోరు తెరిచి మాట్లాడాలంటేనే వణికిపోతారు. చివరకు టీటీడీ ఛైర్మన్ కూడా ఆయన చెప్పినట్టు నడచుకోవాల్సిందే! జగన్ అండతో మొత్తం వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. దానికి దక్షిణగా ప్రభుత్వ పెద్దలకు ‘ఉపయోగపడే’ హైప్రొఫైల్ అతిథులు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా దగ్గరుండి దర్శనాలు చేయిస్తారు. వారు బస చేసిన అతిథి గృహాలకు వెళ్లి మాట కలుపుతారు. ప్రభుత్వ పెద్దలకు ఏం కావాలో వారి చెవిలో వేసి, పనులు సాధించి పెడతారని చెప్తుంటారు. ఒక న్యాయమూర్తి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు అత్యంత ఖరీదైన వాచీల్ని బహుమతులుగా తీసుకెళ్లారనే ఆరోపణలూ ఉన్నాయి. వైసీపీకు ఎన్నికల్లో నిధుల సమీకరణ వ్యవహారాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. అందుకే ఆ అధికారిపై జగన్ ఈగ వాలనివ్వరు. ఆయన లేకపోతే తిరుమల అస్తవ్యస్తం అయిపోతుందంటూ జగన్ స్వయంగా కేంద్ర రక్షణమంత్రికి లేఖ రాశారు. మే 15తో ముగిసే డిప్యుటేషన్ గడువును పదవీ విరమణ చేసే వరకూ పొడిగింపు తెచ్చుకున్నారు. వారిద్దరిది మధ్య పటిష్ఠ బంధానికి ఇదే నిదర్శనం.
అమిత్ షాకు రామచంద్రయాదవ్ లేఖ - టీటీడీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు విజ్ఞప్తి