YS Sharmila Election Campaign:జగన్ పాలన దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించింది. రాష్ట్రం అంతా మాఫియా మయమన్న ఆమె, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం ద్వారా దోచుకుంటున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి హత్యా రాజకీయాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు. బాబు, జగన్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ను నమ్మిన ప్రజల నెత్తిన టోపీ పెట్టారు, చేతికి చిప్ప ఇచ్చారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా, కోవూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె వైసీపీపై నిప్పులు చెరిగారు.
మొదటి 5 ఏళ్లు బాబు, తర్వాత జగన్ అధికారంలో ఉన్నాడు, ఈ 10 ఏళ్లలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు వచ్చాయా ? అని షర్మిల ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉందో, ఇప్పుడు అలానే ఉందన్నారు. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన హైదరాబాద్, చెన్నై, బెంగళూర్ ఉంది, మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఏముందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే, రాష్ట్ర అభివృద్ధి ఇంకోలా వుండేదని పేర్కొన్నారు. బాబు, జగన్ రాజకీయంగా వాడుకున్నారు తప్పిస్తే, హోదా సాధించింది లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్ పులిలా మాట్లాడాడు, అధికారంలో వచ్చాకా పిల్లి అయ్యాడని ఎద్దేవా చేశారు.
అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారా?- జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం : షర్మిల - YS Sharmila vs CM Jagan
జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదని, వారసుడు అయితే వైఎస్ఆర్ ఆశయాలు ఎందుకు అమలు చేయలేదని షర్మిల నిలదీశారు. రాష్ట్రంలోని బిడ్డలను వైఎస్ఆర్ బాగా చూశాడు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశాడని.. జగన్ మాత్రం నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. 2.35లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. నాలుగున్నర ఏళ్లు నిద్ర పోయి, ఎన్నికల 6 నెలల ముందు నిద్ర లేచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతుందని షర్మిల ఆరోపించారు. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తుందన్నారు. బాబు, జగన్ పోటీ పడి బీజేపీ తో పొత్తులు పెట్టుకుంటున్నారని, బీజేపీ తో బాబు ది పొత్తు.. జగన్ ది అక్రమ పొత్తు అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ తన జీవితంలో బీజేపీ నీ తీవ్రంగా వ్యతిరేకించారని, ఇప్పుడు వారసుడు మాత్రం బీజేపీ తో డ్యూయెట్లు పాడుతున్నారని ఆరోపించారు. మణిపూర్ ఘటన మీద కనీసం జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ కి ఓటు వేసినా బీజేపీ కి వేసినట్లే అన్నారు. నెల్లూరు ఎంపీ గా కొప్పుల రాజును, కోవూరు ఎంఎల్ఏ గా కిరణ్ కుమార్ రెడ్డికి గెలిపించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి : వైఎస్ షర్మిల - YS Sharmila Fires On Jagan