YS Jagan on Leaders Migration :ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి ప్రభావంతో వైఎస్సార్సీపీకి చెందిన నేతలు ఇతర పార్టీల బాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఆయా పార్టీలలో చేరారు. ఇంకా చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సందర్భంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తిరుపతి, విశాఖపట్నం, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం, విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలని అన్నట్లు తెలుస్తోంది. వెళ్లేవారు వెళ్తారని, బలంగా నిలబడగలిగేవారే తనతో ఉంటారని చెప్పినట్లు సమాచారం. పార్టీలో తాను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చామని, ఇప్పుడూ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దామని, ఇందుకు ఇబ్బందేమీ లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
Jagan Meeting Leaders in Tadepally : శాసనమండలిలో వైఎస్సార్సీపీ సంఖ్యా బలం ఉందని ఇటీవల పార్టీ నాయకులతో వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చు, ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఆ మాటలపై చర్చ జరిగింది. దీనిపై జగన్ స్పందిస్తూ గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లారని తెలిపారు. వాళ్లలో ఎంత మంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు? అటూ ఇటూ వెళ్లేవారు ఎటూ కాకుండా పోతారని, ఎవరిష్టం వారిదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా, వెనక్కి తగ్గకూడదు, మళ్లీ ముందుకు కదలాలని జగన్ సూచనలు చేశారు.
ఇటీవలే వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫలితాలు చూశాక షాక్ అయ్యానని ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించిందని ఆయన అన్నారు. ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టిందని జగన్ వెల్లడించారు.