ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ అంటే లోకల్​ అనుకుంటివా? ఇంటర్నేషనల్​! - అవినీతిలో తగ్గేదేలే - YS JAGAN CORRUPTION

ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి

YS_Jagan_Corruption
YS Jagan Corruption (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 7:32 AM IST

YS Jagan Corruption: ‘‘పుష్పా అంటే నేషనల్‌ అనుకుంటిరా! ఇంటర్నేషనల్’’ ఈ డైలాగ్‌ ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా ట్రైలర్‌లోనిది. అచ్చం ఇలాగే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి కూడా ఇప్పుడు లోకల్, నేషనల్‌ దాటేసి ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరుకుంది. అది కూడా అక్కడికో, ఇక్కడికో కాదు, ఏకంగా అమెరికా వరకూ విస్తరించింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు కోసం సెకితో ఒప్పందం చేసుకున్నందుకు జగన్‌ మోహన్ రెడ్డికి గౌతమ్‌ అదానీ 1,750 కోట్ల రూపాయల మేర ముడుపులు ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం అక్కడి న్యాయస్థానంలో వేసిన అభియోగపత్రంలో ప్రస్తావించడం సంచలనంగా మారింది.

ముడుపుల్లో సింహాభాగం జగన్‌కే:భారతదేశంలో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసమంటూ యునైటెడ్‌ స్టేట్స్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా అమెరికాలోని కంపెనీల నుంచి భారీ ఎత్తున నిధులు సమీకరించిన అదానీ సంస్థ ఆ సొమ్మును జగన్‌ మోహన్ రెడ్డి సహా మరికొందరికి లంచంగా ఇచ్చిందనేది ప్రధాన అభియోగం. న్యూయార్క్‌లోని ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ గ్రాండ్‌ జ్యూరీ, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్, యూఎస్‌ సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (SEC) వంటి దర్యాప్తు సంస్థలు దాదాపు రెండేళ్ల పాటు లోతైన విచారణ జరిపి ఈ అక్రమాలను నిగ్గుతేల్చాయి. అభియోగాలన్నింటినీ న్యూయార్క్‌లోని ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సమర్పించాయి. గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ, వినీత్‌ జైన్, రంజిత్‌ గుప్తా తదితరులను నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపారు.

నిందితుడిగా చేర్చడం తథ్యం: అమెరికా కంపెనీల నుంచి అదానీ సమీకరించిన నిధుల్లో సింహభాగం ముడుపుల రూపంలో జగన్‌ మోహన్ రెడ్డికే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినందున, ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చడం తథ్యమని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఈ కేసులో ఆయన మెడపై కత్తి వేలాడుతున్నట్లే.

జగన్ మెడకు అదానీ స్కామ్ - చేతులు మారిన రూ.1750 కోట్లు - అమెరికా కోర్టు ఆరోపణ

అమెరికా చట్టాల్లో నేర నిరూపణైతే తీవ్ర శిక్షలు : అమెరికాలో ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (FCPA), సెక్యూరిటీస్‌ అండ్‌ వైర్‌ ఫ్రాడ్, లంచం అభియోగాలతో అదానీపై కేసు నమోదైంది. ఆయా చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు, విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో భాగం కాకుండా చూడడమే ఎఫ్‌సీపీఏ చట్టం లక్ష్యం. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇప్పటికే గౌతమ్‌ అదానీపై అరెస్టు వారంట్‌ జారీ అయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. తదుపరి దర్యాప్తులో జగన్ మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చి ఇదే తరహాలో అరెస్టు వారంటు జారీ అయితే ఆయన అమెరికాలో జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

జగన్‌ ఖాతాలోకి మరో ఆర్థిక నేరం:వైఎస్జగన్‌ మోహన్ రెడ్డి ఖాతాలోకి మరో ఆర్థికనేరం చేరిందని సీనియర్‌ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ఇప్పటివరకూ ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఆయన ఇంటర్నేషనల్ స్థాయికి తన అవినీతిని వ్యాపింపజేశారని ఎద్దేవా చేశారు. అమెరికా కంపెనీల నుంచి సమీకరించిన నిధుల్లో నుంచి 1,750 కోట్ల రూపాయలు ముడుపులుగా పొందడమంటే అతిపెద్ద నేరం కింద లెక్క అని పేర్కొన్నారు. ఈ కేసులో జగన్‌ మోహన్ రెడ్డికి కూడా నిందితుడిగా చేర్చడం తథ్యం అని తెలిపారు. ఇప్పటివరకూ భారతదేశంలోనే అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్‌, ఇక అమెరికాలోనూ విచారణ ఎదుర్కోవాలని, నేరం నిరూపణైతే కఠిన శిక్షలు పడే అవకాశముందని అన్నారు.

మొదటి నేరం:అమెరికా కంపెనీల నుంచి సేకరించిన నిధుల్లో సింహభాగాన్ని అదానీ సంస్థ జగన్‌ మోహన్ రెడ్డికి ముడుపులుగా చెల్లించిందనేది ఆ సంస్థపై ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో జగన్‌కు ముడుపులు చేరినందున ఆయన కూడా ఈ కేసులో నిందితుడయ్యే అవకాశముంది.

రెండో నేరం:ముడుపులు ఇవ్వడం, తీసుకోవడం రెండూ అమెరికా చట్టాల ప్రకారం తీవ్రనేరాలు. ఇక్కడ అమెరికా కంపెనీల నుంచి సేకరించిన నిధులతో ముడుపులు చెల్లించిన అదానీ నిందితుడైతే, ఆ సొమ్ము పొందిన వైఎస్ జగన్‌ సైతం నిందితుడే అవుతారని న్యాయనిపుణులు చెబుతున్నారు.

సీబీఐ, ఈడీ కేసుల్లో ఇప్పటివరకు వందలసార్లు వాయిదాలు పొందుతూ వైఎస్ జగన్‌ కాలం నెట్టుకొచ్చేస్తున్నారు. తాజా వ్యవహారంలో జగన్ మోహన్ రెడ్డి తప్పించుకునేందుకు అవకాశం ఉండదనేది న్యాయనిపుణుల మాట.

సొంతలాభం కోసం ప్రజలపై భారాన్నీ లెక్కచేయని జగన్‌

ABOUT THE AUTHOR

...view details