Young Woman Wrote a Book on Social Injustice to Widowed Women: అత్యున్నత విద్యావంతులు సైతం సంప్రదాయాల పేరిట వితంతువులను బాధపెట్టడం చూసి చలించిపోయింది ఈ యువతి. టెక్ యుగంలోనూ ఇలాంటి అనాచారాలు కొనసాగటం తనను బాధకు గురి చేసింది. భర్తను కోల్పోయిన స్త్రీలను శుభకార్యాల్లో ఇతరులు వెలివేసినట్లుగా చూడటం సరికాదని చాటాలనుకుంది. ఎంతో అధ్యయనం చేసి "ది పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్‌మెంట్" పేరిట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఆమె విజయవాడకు చెందిన సౌమ్య.
విజయవాడకు చెందిన సౌమ్య తూములూరి సీఏ(CA) చదువుతోంది. యోగా శిక్షకురాలిగానూ పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచే వితంతువులను కట్టుబాట్ల పేరుతో కొంతమంది బాధించడం స్వయంగా చూసింది. అందుకే వాళ్ల ఆవేదనను అందరికీ తెలిసేలా చేయాలని నిర్ణయించుకుంది. రచనలో ఎలాంటి అనుభవం లేకున్నా తను చూసిన సంఘటనల ప్రేరణతో రచయిత్రిగా మారింది.
అన్ని రంగాల్లో మహిళా సాధికారత మరింత పెరగాలి : శైలజా కిరణ్
వితంతువుల సమస్యలను పుస్తక రూపంలో ప్రపంచానికి తెలియజెప్పాలని సౌమ్య 5 ఏళ్ల క్రితమే నిశ్చయించుకుంది. వివక్ష వల్ల వాళ్లు అనుభవించే నరకయాతన, అందుకు పరిష్కార మార్గాలు ఈ పుస్తకంలో పొందుపరచాలనుకుంది. అధ్యయనంలో భాగంగా కొంతమంది వితంతువులు, న్యాయనిపుణులు, వేద పండితులు, ఆధ్యాత్మికవేత్తలను కలసింది. మానసిక నిపుణులతో చర్చించి ఎన్నో విషయాలను సేకరించింది. వాటి ఆధారంగా "ది పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్‌మెంట్ ఫ్రమ్ షాడోస్ టు స్పాట్‌లైట్" బుక్‌ను విడుదల చేసింది.