NITI Aayog Fiscal Health Index 2025 : తన పాలనలో జగన్ సాధించిన మరో ఘనకార్యం బయటపడింది. వైఎస్సార్సీపీ హయాంలో రుణ సామర్థ్యంలో ఏపీకి సున్నా మార్కులు పడ్డాయి. ఈ మేరకు నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచీ తేల్చింది. అధికారిక అప్పుల లెక్కలతోనే ఇంత దారుణం వెల్లడైంది. అదే అనధికారిక అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆర్థిక ఆరోగ్య సూచీ పరంగా ఏపీ జగన్ పాలనలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది. అంతేకాదు నాటి సర్కార్‌లో రాష్ట్రం అప్పులు భరించలేని స్థాయికి పడిపోయిందని విశ్లేషించింది. రుణ సామర్థ్యం అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు సున్నా మార్కులు వేసింది. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీకి సంబంధించినంత వరకు అప్పులు కుప్పలుతెప్పలుగా పెరిగిపోయాయని తెలిపింది. వాటిని చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నదే కీలకాంశం.
18 రాష్ట్రాల్లో 17వ స్థానం : ఈ నివేదికను రూపొందించేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన గణాంకాలనే పరిగణనలోకి తీసుకున్నామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 2022-2023 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ తన నివేదికను గతేడాది సమర్పించింది. ఏపీ సర్కార్ అనేక అప్పులను రహస్యంగా ఉంచిందని కేంద్రానికి ఆ లెక్కలు చెప్పడం లేదని, ప్రభుత్వ గ్యారంటీ ఉన్న రుణాల వివరాలు వెల్లడించడం లేదని వెల్లడించింది. పెండింగ్ బిల్లుల మొత్తాలు కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర అప్పులు, ద్రవ్యలోటు మరింత ఎక్కువగా ఉంటాయని కాగ్ అప్పట్లోనే ఆక్షేపించింది.
ఇప్పుడు నీతి ఆయోగ్ నివేదికలోనూ కేంద్రానికి రాష్ట్రం అధికారికంగా ఇచ్చిన లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అనధికారిక అప్పులు, పెండింగ్ బిల్లులు, వివిధ కార్పొరేషన్ల ఖాతాల్లోని రెవెన్యూ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ఆర్థిక స్వరూపం నీతి ఆయోగ్ లెక్కల్లో ఇంకే స్థాయిలో ఉండేదోననే మాట వినిపిస్తోంది. అప్పటి సర్కార్ ఎప్పటికప్పుడు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరిస్తూ ఆర్థిక పరిమితుల్లో ఉండేందుకు ప్రయత్నించిందని కూడా నీతి ఆయోగ్ నివేదిక ప్రస్తావించింది.
దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను నీతి ఆయోగ్ నివేదిక విశ్లేషించింది. 2022-2023 నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్థిక ఆరోగ్య సూచీ-2025ను వెలువరించింది. కొన్ని ఆర్థిక ప్రమాణాలను ఎంచుకుని వివిధ విభాగాల్లో రాష్ట్రాలకు మార్కులు ఇచ్చింది. ఐదు కీలకాంశాలు, మరో తొమ్మిది సూక్ష్మ అంశాలను లోతుగా పరిశీలించి ఈ మార్కులు కేటాయించింది. వాటి సగటు ఆధారంగా ర్యాంకులివ్వగా, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. ఇవే అంశాలు ప్రాతిపదికగా 2014-2019 మధ్య ఏపీ 31.7 మార్కులతో 13వ స్థానంలో ఉంది. 2022 వచ్చేసరికి ఈ స్కోర్ 27.7కు పడిపోయినప్పటికీ, స్థానం మారలేదు. 2022-2023లో రాష్ట్ర స్కోరు 20.9 మార్కులకు పడిపోయింది.
AP Ranks 17th in NITI Aayog Index : రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి, వడ్డీల చెల్లింపుల్లో వృద్ధి రేటును తులనాత్మకంగా పరిశీలించి, రాష్ట్రాలు ఆ రుణాలు భరించగల స్థితిలో ఉన్నాయా? తిరిగి తీర్చగలవా? అన్నది నీతి ఆయోగ్ పరిశీలించింది. ఈ పరిశీలనలో ప్రతికూల ఫలితాలు రావడం వల్లే ఏపీని ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్న రాష్ట్రంగా పేర్కొంటూ, ఈ కేటగిరీలో సున్నా మార్కులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు ఎక్కువగా ఉన్నాయని అధిక ద్రవ్యలోటుతో ఇబ్బంది పడుతోందని ప్రస్తావించింది. రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు లోటుగా ఉన్న ద్రవ్యాన్ని అప్పుల ద్వారా భర్తీ చేస్తుంటారు. అలా భర్తీ చేసిన మొత్తాన్నే ద్రవ్యలోటుగా లెక్కిస్తారు.
జగన్ పాలనలో ఆర్థికం అస్తవ్యస్తం - 2022-23 నాటి పరిస్థితులపై నీతి ఆయోగ్ విశ్లేషణ
విశాఖలో గ్రోత్ హబ్- ప్రణాళికలు సిద్దం చేస్తోన్న నీతి ఆయోగ్