Visakha Honey Trap Case Updates : తొలుత ఫోన్ చేస్తారు తీయగా మాట్లాడతారు! పరిచయం పెంచుకుంటారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్‌లతో ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత పర్సనల్‌గా కలుద్దామని చెబుతారు. టెంప్ట్ అయి ముందడుగు వేస్తే అందినకాడికి దోచేస్తారు. తాజాగా విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
వలపు వలతో పరిచయమైన కొన్ని గంటల వ్యవధిలోనే శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన ముంజ రామారావు (38) అనే వెల్డర్‌ను బురిడీ కొట్టించి నగదు కొట్టేసిన ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని పోలీసు బ్యారెక్సు వద్దనున్న కమిషనరేట్‌లో డిప్యూటీ పోలీసు కమిషనరు లతామాధురి శనివారం సమావేశాన్ని ఏర్పాటుచేసి ఆ వివరాలను వెల్లడించారు. ఈనెల 18న విశాఖ కంచరపాలేనికి చెందిన కుప్పిలి ఆశారాణి (34) ఓ నంబర్ నుంచి రామారావుకి ఫోన్ చేసింది. మీరు ఎవరు అని అడగ్గా మీరు నాకు తెలుసు అని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ముగ్గులోకి దింపింది.
రామారావు తన కుమార్తెను తీసుకుని ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్దనున్న పాఠశాలకి 19వ తేదీన వచ్చారు. ఆరోజు కూడా ఆశారాణి ఫోన్ చేసింది. ఇద్దరం కలుద్దామనడంతో ఆమె ఈ విషయాన్ని తన గ్యాంగ్‌కి చెప్పింది. తగరపువలస పరిధిలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం వద్ద నిరీక్షించిన రామారావు వద్దకు ఆరుగురు అపరిచిత వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బెదిరింపులకు పాల్పడి తమతో పాటు బైక్‌పై ఎక్కించుకుని భీమిలి మండలం దాకమర్రి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయారు.
Rising Honey Trap Cases Visakha : అక్కడ రామారావును కొట్టి ఆయన జేబులోని రూ.10,000లు, సంచిలో ఉంచిన మరో రూ.40,000లు, సెల్‌ఫోన్ తీసుకుని ఫోన్ పే ద్వారా రూ.8900 లాక్కుని పారిపోయారు. జరిగిన విషయాన్ని కుటుంబీకులకు చెప్పిన బాధితుడు నాలుగు రోజుల తర్వాత భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించి నిందితులను పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు వ్యక్తులకు ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు.
ఇందులో విజయనగరం టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటరుగా ఉన్న బంగారి చక్రధర్ (37), గౌడవీధికి చెందిన ఇంటి సురేశ్ (30), అదే జిల్లాలోని బొండపల్లి మండలానికి చెందిన డోల లక్ష్మణరావు (27), విశాఖ నగరంలోని పెద వాల్తేరు ఉషోదయ కూడలి నివాసి ములపర్తి వెంకటేశ్ (29), ఆదర్శనగర్‌కి చెందిన వాసుపల్లి శ్యామ్‌ప్రకాశ్ (30), కంచరపాలేనికి చెందిన కుప్పిలి ఆశారాణి (34), పెదవాల్తేరుకి చెందిన బారిక స్వామి(24)లను జైలుకి పంపారు.
ఇందులో పాత నేరస్థుడైన చక్రధర్, ఆశారాణిలు స్నేహితులు కావడంతో అతడి సలహా మేరకు ఆమె రామారావుకి ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా కూడా పలు కేసుల్లో ఉన్న పాత నేరస్తులేనని పేర్కొన్నారు. ఇందులో బొండపల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మణ సొంత తల్లిదండ్రులనే చంపిన కేసులో ఆరోపణలతో జైలుకి వెళ్లి ఇటీవలే విడుదలైనట్లు చెప్పారు. ఈ కేసును చాకచాక్యంగా ఛేదించిన నార్త్ సబ్‌డివిజన్ క్రైం పోలీసులను అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ వెంకటరావు, సీఐ బీఎస్‌ఎస్ ప్రకాశ్, ఎస్.ఐ సూర్య ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.
హనీట్రాప్‌లో పడి కొకైన్ స్మగ్లింగ్.. అడ్డంగా బుక్కైన వ్యక్తి.. రూ.28కోట్ల డ్రగ్స్ సీజ్