Pawan kalyan Letter to Janasena Cadre : జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో దాన్ని పోస్ట్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన- టీడీపీ- బీజేపీలతో కూడిన ఎన్డీయే సాధించిన ఘనవిజయం చరిత్రాత్మకమని చెప్పారు. ఇది కేవలం కూటమి బలం మాత్రమే కాదని, ఐదేళ్ల వైఎస్సార్సీపీ నిరంకుశ పాలనలో అవినీతి, సంఘ విద్రోహ చర్యలు, చట్టసభల్లో వారి జుగుప్సాకర వ్యవహార శైలి, శాంతిభద్రతల వైఫల్యం కారణమని అన్నారు. అదేవిధంగా అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాల్జేసి అప్పుల ఏపీగా మార్చటం పట్ల ప్రజలు విసుగెత్తిన ఫలితమే ఈ విజయమని తెలిపారు.
ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన, భావితరాల గురించి ఆలోచించే నేతలు కలిసి రావడంతో కూటమి పట్ల నమ్మకంతో ప్రజలు 164 స్థానాల్ని ఎన్డీయేకు ఇచ్చారన్నారు. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా భావించామని చెప్పారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ సర్కార్ అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడించారు.
Pawan kalyan on Janasena Cadre : గత 7 నెలల్లో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పవన్ కల్యాణ్ వివరించారు. మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలుచేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. వీటన్నింటికీ కారణం 5 కోట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్ అందించాలనే సంకల్పమేనని స్పష్టంచేశారు.
ఐదు కోట్ల మంది ఆశల్ని నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయీచేయీ కలిపి నడవాల్సిన అవసరముందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదని చెప్పారు. భవిష్యత్‌లోనూ చేయనని స్పష్టంచేశారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవడం, వారికి అండగా నిలబడడం, పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే తనకు తెలుసని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని పవన్ కల్యాణ్ లేఖలో తెలిపారు.
'చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు' - పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన పవన్ కల్యాణ్
గ్రీన్‌కో సోలార్‌పవర్ కంపెనీ వల్ల లక్షల మందికి ఉపాధి : పవన్ కల్యాణ్