Iconic Towers in Amaravati Updates : అమరావతిలో పరిపాలనకు కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఐకానిక్ టవర్లపై సీఆర్డీఏ దృష్టి సారించింది. వీటి పునాదుల్లో నిలిచిన నీటిని తోడివేసే ప్రక్రియ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ ఆకాశ హర్మ్యాల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు కొత్త రేట్ల ప్రకారం అంచనాలు సిద్ధమవుతున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల అంచనాలు గతం కంటే సుమారు 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడే నిర్మాణాలను కొనసాగించి ఉంటే పెద్ద మొత్తంలో ప్రజా ధనం ఆదా అయ్యేది.
రాష్ట్ర పరిపాలన మొత్తం ఒకేచోట కేంద్రీకృతమయ్యేలా ఐదు టవర్లను నిర్మించేందుకు గత తెలుగుదేశం హయాంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ సంస్థ దీని నమూనా రూపొందించింది. నాలుగు హెచ్‌వోడీ టవర్లతో పాటు ఒక జేఏడీ టవర్ నిర్మాణం చేపట్టారు. బహుళ అంతస్తులు 10 కాలాల పాటు పటిష్టంగా ఉండేందుకు పునాదులకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేసింది. 2018లో ప్రారంభమైన ఈ టవర్ల నిర్మాణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో నిలిచిపోయాయి. పునాదుల్లో భారీగా నీరు నిలిచింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ప్రారంభించేందుకు వీలుగా గతేడాది డిసెంబరు 25న నీటి తోడివేసే ప్రక్రియను గుత్తేదారుకు అప్పగించింది. 41 రోజుల్లో 0.06 టీఎంసీల మేర నీటిని తోడారు. ఐదు టవర్లకు గతంలో రూ.2703 కోట్లుగా అంచనాలు రూపొందించి 2018లో 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. అత్యంత ఎత్తులో నిర్మించనున్న జేఏడీ టవర్ బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. సీఎం కార్యాలయం ఈ టవర్‌లోనే కొలువుదీరనుంది. టెర్రస్‌పై హెలిప్యాడ్ కూడా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు.
Amaravati Iconic Towers : మిగిలిన 4 హెచ్‌వోడీ టవర్లు 39 అంతస్తులుగా నిర్మిస్తారు. ఇవన్నీ డయాగ్రిడ్ నమూనాలో నిర్మిస్తుండడంతో సగానికి పైగా ఇనుము వినియోగించాల్సి ఉంది. 2018లోని స్టీల్ ధరకు ఇప్పటికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో టన్ను రూ.40,000లు ఉండగా ప్రస్తుతం రూ.64,000ల వరకు పలుకుతోంది. సుమారు 65 శాతం వరకు ధర పెరిగింది. అంతిమంగా ఇది నిర్మాణ వ్యయంపై పడుతోంది. కొత్త అంచనాలు త్వరలో సిద్ధం కానున్నాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా అంతర్గత డిజైన్లు కూడా మారే అవకాశం ఉంది. ఇవన్నీ కొలిక్కి వస్తే నెల రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలు ఉండే జేఏడీ టవర్- 50 అంతస్తుల భవనం మొత్తం విస్తీర్ణం 70 లక్షల చదరపు అడుగులు. ఈ ఐదు టవర్లను కలుపుతూ రెండంతస్తుల ఎత్తులో పొడవైన కాలిబాట వంతెనను నిర్మిస్తారు. దీని వల్ల ఒక టవర్ నుంచి మరొక టవర్‌కు సులువుగా రాకపోకలు సాగించే వీలు కలుగుతుంది. మన రాష్ట్రానికి చెందిన స్థానిక సాంప్రదాయ పెడన కలంకారి డిజైన్‌ను తలపించేలా ఈ అత్యాధునిక టవర్లు రూపొందుతాయి.
జగన్ విధ్వంసంతో సీఆర్డీఏపై రూ.5 కోట్ల భారం - పాత ప్లాన్ ప్రకారం నిర్మాణానికి మరింత సమయం
ఏపీ సీఆర్‌డీఏ పరిధి పెంపు - 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు