AP HC on Son Neglected Mother Petition : తల్లిదండ్రులు తమ బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే పిల్లలు మాత్రం వారిని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదు. కానీ వాళ్లు ఇచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్నారు. తాజాగా ఇంటిని స్వాధీనం చేసుకుని కన్న తల్లినే ఇబ్బందులకు గురిచేస్తున్న కుమారుడిపై హైకోర్టు కన్నెర్రజేసింది. ఈ మేరకు న్యాయస్థానం తీర్పుతో అధికారులు ఆగమేఘాల మీద వచ్చి అతడిని ఇంటి నుంచి పంపించేసి తల్లికి తాళం చెవులు అప్పగించారు.
దీనికి సంబంధించి తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డు ఎస్టీ కాలనీలో ప్రభుత్వం కేటాయించిన స్థలం, నిధులతో 1990లో వాంకడవత్ లక్ష్మీబాయి, వెంకటేశ్వర నాయక్ ఇల్లు నిర్మించుకున్నారు. వీరి పెద్ద కుమారుడు శ్రీనివాసనాయక్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వేరేచోట ఉంటున్నారు. చిన్న అబ్బాయి హనుమంతునాయక్ ఆటో నడుపుకుంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
2021లో తండ్రి మరణించాడు. అప్పటి నుంచి తల్లి పోషణ బాధ్యతను విస్మరించగా, ఆమె పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కూడా హనుమంతు నాయక్ పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ ఇంటిని తల్లికి అప్పగించాలని తాజాగా ఆదేశించిందని తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. వెంటనే పోలీసుల సాయంతో హనుమంతు నాయక్‌ను ఇల్లు ఖాళీ చేయించామని చెప్పారు. అనంతరం సామానులను అక్కడి నుంచి తరలించామని వివరించారు. మరోవైపు తన సోదరుడే దీని వెనుక ఉండి తనకు అన్యాయం చేశాడని హనుమంతు నాయక్ ఆరోపించారు.....
కన్నవారిని పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయ్!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు: సుప్రీంకోర్టు తీర్పు