Woman who Made Allegations on Kiran Royal Arrested: జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ గడిచిన రెండు రోజులుగా ఆరోపిస్తున్న మహిళ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెను రాజస్ధాన్‌కు చెందిన జైపూర్ పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్‍పై విమర్శలు చేసి తిరిగి వెళ్తున్న ఆమెను రాజస్ధాన్ నుంచి వచ్చిన మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో కేసు: అనంతరం ఆమెను తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తిరుపతి మొదటి అదనపు సివిల్ కోర్టులో హాజరు పరిచారు. ఆమెపై ట్రాన్సిస్ట్ అరెస్టు వారెంట్ ఉన్న నేపథ్యంలో జైపూర్ పోలీసులకు అప్పగించాలంటూ జడ్జి ఆదేశించారు. సదరు మహిళకు ప్రాణహాని ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకునేందుకు న్యాయస్ధానం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆమెని చెన్నై మీదుగా జయపురకు పోలీసులు తరలించనున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో 2021లో జైపూర్, చంద్వాది పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు.
తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం: ఆర్థిక లావాదేవీలు, ఇతర వివాదాల నేపథ్యంలో కిరణ్ రాయల్‌పై ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కిరణ్ రాయల్‌పై ఆమె మరికొన్ని ఆరోపణలు చేశారు. ఆయన మాయమాటలకు తాను మోసపోయానని అన్నారు. తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నట్లు వెల్లడించారు.
కిరణ్ రాయల్ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు ఆరోపించారు. తనకు ఏ పార్టీ నుంచి మద్దతు లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
జనసేన కిరణ్ రాయల్‌పై ఆరోపణలు - పార్టీకి దూరంగా ఉండాలన్న హైకమాండ్
కిరణ్‌ను దూరం పెట్టిన జనసేన : జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌పై రెండు రోజులుగా వస్తున్న అభియోగాలపై హైకమాండ్ స్పందించింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర వివాదాలపై ఓ మహిళ ఆయనపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశించారని, అప్పటివరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి పి. హరిప్రసాద్ అందులో తెలిపారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలి తప్ప, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత అంశాలపై కాదని అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు తెలిపారు. మరోవైపు, కిరణ్ రాయల్ తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారిని కలిసి తనపై ఆరోపణలు చేసిన మహిళతో పాటు సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు
'8 వారాల తరువాత వస్తా!' - మరోసారి సీఐడీ విచారణకు ఆర్జీవీ డుమ్మా