Vallabhaneni Vamsi Remand: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సత్యవర్థన్‌ను బెదిరించిన కేసులో వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులకు రిమాండ్ విధించడంతో వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్థన్‌ను బెదిరించిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
వైఎస్సార్సీపీ హయంలో అధికారం అండతో రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాల మధ్య వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు.
కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతోపాటు మరికొందరిపైనా విజయవాడ పటమట స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం హైదరాబాద్ చేరుకుంది. రాయదుర్గంలో వంశీ నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజాము వెళ్లి ఆయన ఇంటి తలుపు తట్టారు. కేసు వివరాలు వివరించి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వంశీ, ముందస్తు బెయిల్ పిటిషన్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అరెస్ట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు.
దుస్తులు మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లిన వంశీ వైఎస్సార్సీపీ నేతలు, సన్నిహితులు, అనుకూల మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేస్తూ ఉండిపోయారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారని, వెంటనే తన ఇంటివద్దకు రావాలని కోరారు. తన వాహనాన్ని అనుసరిస్తూ వచ్చి అవసరమైతే అడ్డుకోవాలని సూచించారు. సుమారు 40 నిమిషాల పాటు గదిలోనే ఉండిపోయిన వంశీని బయటకు రావాలని పదేపదే సూచించడంతో ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు.
కృష్ణలంక స్టేషన్‌లో పోలీసుపై మరోసారి వల్లభనేని వంశీ చిందులు తొక్కారు. తనపై కేసు పెట్టింది ఎవరో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ADCP ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8.30 గంటల వరకు వంశీని సుధీర్ఘంగా విచారించిన అనంతరం వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ముగ్గురిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ - కృష్ణలంక పీఎస్‌కు తరలింపు