Minister Nara Lokesh Review on Education: వివాదాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీల్లో సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు.
ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై మంత్రి లోకేశ్ సమీక్షించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 42 వల్ల 80 ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయని మండిపడ్డారు. దీని వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను కాజేసేందుకు జగన్ కుట్ర పన్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.
'ప్రతిపక్షం పోటీలో లేదనే నిర్లక్ష్యం వద్దు' - ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు లోకేశ్ దిశానిర్దేశం
నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీ: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి మంత్రి లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.
నైపుణ్య గణన కార్యక్రమంపైనా సమావేశంలో మంత్రి లోకేశ్ చర్చించారు. నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు. స్కిల్ సెన్సెస్‌ను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసంధానించాలని సూచించారు. యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాస్థాయిలో ఉపాధి కల్పనాధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, సీడాప్ పరిధిలోని జిల్లా మేనేజర్ విధులను ఏకీకృతం చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.
పలు వర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్ల నియామకం - ప్రతిభావంతులకే అవకాశం