ETIKOPPAKA TOYS IN DELHI KARTAVYAPATH: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో రాష్ట్రప్రభుత్వం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం ఆకట్టుకొంది. శకటం ముందు వినాయకుడు, చివర ఎత్తైన శ్రీ వేంకటేశ్వరస్వామి రూపాలు, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టును ప్రతిబింబించే బొమ్మలకొలువు, చిన్నారుల ఆటపాటల చిత్రాలతో రూపొందించిన ఈ శకటం ఆధ్యాత్మిక భావాన్ని, సంస్కృతిని చాటిచెప్పింది.
అలరించిన కళాకారుల ప్రదర్శనలు: శకటం నడుస్తున్నంత సేపూ బొమ్మలు.. బొమ్మలు.. ఏటికొప్పాక బొమ్మలు.. ఆంధ్రప్రదేశ్ బొమ్మలు.. ఇవి విద్యను నేర్పే బొమ్మలు.. వినోదాల బొమ్మలు.. భక్తిని చాటే బొమ్మలు.. హస్తకళల హంగులు.. సహజ ప్రకృతి రంగులు.. అన్న గీతానికి రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారులు, చిన్నారులు నాట్యం చేస్తూ ప్రేక్షకులకు వీటి ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. 2020 ఆగస్టు 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశీయంగా తయారయ్యే బొమ్మలను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చిన తర్వాత ఏటికొప్పాక బొమ్మలకు ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్రప్రభుత్వం సైతం దీనికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తోంది.
భారతీయ సంస్కృతికి ప్రతీక ఏటికొప్పాక బొమ్మలు: సంప్రదాయాలకుఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన 67వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు అక్కడి అంతర్జాతీయ ప్రతినిధులకు ఈ బొమ్మలను బహుకరించారు. అంకుడు కర్రతో తయారుచేసిన ఈ బొమ్మల్లో ఎక్కడా కూడా వంపు కనపడదు. మొన లేకుండా అన్నివైపుల నుంచి గుండ్రంగా ఉండడం వల్ల వీటితో ఆడుకునే పిల్లలకు గాయాలవ్వవు. కళాకారులు ఈ బొమ్మల ద్వారా రాష్ట్రంతోపాటు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.
హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు: రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే కర్తవ్యపథ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటం పరుగులు తీయడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల శకటం గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఇతర ప్రముఖులందరినీ ఆకట్టుకుంది. పర్యావరణహితం, సహజసిద్ధమైన వనరులతో చేసే ఈ బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. దీనికి కారణభూతులైన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వారసత్వానికి చిహ్నమన్న మంత్రి లోకేశ్: దిల్లీ పరేడ్‌లో ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రదర్శన రాష్ట్రానికి గర్వకారణమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ బొమ్మలు మన ఘన వారసత్వానికి చిహ్నమని ఎక్స్ వేదికగా ఆదివారం కొనియాడారు.
బొమ్మలకు ప్రాణం పోస్తున్న మహిళలు - ప్రసిద్ధ ఉదయగిరి బొమ్మల గురించి మీకు తెలుసా?
ఏటికొప్పాకలో బొమ్మల స్టాల్స్.. 'ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి' వేగవంతం
అంకుడు కర్రలకు లైన్ క్లియర్ - ఆ చెట్లు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం