YSRCP Leader Sajjala Attend Hearing At Police Station : ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల పాత్రను పోలీసులు గుర్తించారు. ఆ మేరకు సజ్జలను మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారణకు పిలిచారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సిఐ వై. శ్రీనివాసరావు సజ్జలను కేసుకు సంబంధించి 38 ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. పోలీసులు ఏం అడిగినా తెలియదు, గుర్తులేదు అని సజ్జల ఆన్షర్ చేశారు.
విచారణకు సజ్జల సహకరించలేదు :టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ120గా సజ్జలను విచారించామని మంగళగిరి సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా సిద్ధం చేసుకున్న 38 ప్రశ్నలు అడిగామని, చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అని సమాధానం ఇచ్చారని ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. తమ వద్ద ఉన్న ఆధారాలతో ప్రశ్నించినట్లు వెల్లడించిన సీఐ, సజ్జలను ఫోన్ అడిగినా ఇవ్వలేదని తెలిపారు. విచారణకు ఆయన సహకరించలేదని, తమ ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో ఆన్షర్స్ చేశారన్నారు.
ఘటన జరిగిన రోజు తాను అక్కడ లేనని చెప్పారని, ఈ కేసులో సజ్జల పాత్ర ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. మూడు నెలలుగా ఈ కేసును విచారించి, కేసు దర్యాప్తు దాదాపు చివరిదశకు వచ్చినట్లు చెప్పారు. చాలా మంది నిందితులు కోర్టుల ద్వారా రక్షణ పొందారని, దీనివల్ల కేసు విచారణ అనుకున్న వేగంగా జరగట్లేదని సీఐ తెలిపారు. నిందితులను అరెస్టు చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుందన్న ఆయన, కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి ఇచ్చిందని వెల్లడించారు. ఉత్తర్వులు రాగానే దస్త్రాలను సీఐడీకి ఇస్తామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.