World Telugu Writers Sixth conference :తెలుగు వెలుగులీనింది, అమ్మ భాష ప్రతిధ్వనించింది. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా"అమ్మభాషను కాపాడుకుందాం.. ఆత్మాభిమానం పెంచుకుందాం" అనే నినాదంతో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యయి. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి, గౌరవాన్ని తీసుకొచ్చారంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను స్మరించుకున్నారు. తెలుగు భాష పరిరక్షణకు అంతా కలిసికట్టుగా నిలబడాలని వక్తలు పిలుపునిచ్చారు.
విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభల్లో తొలిరోజు కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. తొలుత సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలుగు తల్లి విగ్రహానికి, అనంతరం పొట్టి శ్రీరాములు, రామోజీరావు విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కళాశాల ఆవరణలో తెలుగు రచయితల విశేషాలను, తెలుగు భాష గొప్పతనాన్ని, మహనీయుల ఫొటోలతో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను అతిథులు తిలకించారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతోపాటు మరో రెండు వేదికల్లో సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించారు.
తెలంగాణలో తెలుగు బతుకుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో తరుగుతోందని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, తెలంగాణ సాహిత్య అకాడమీలు బాగా పనిచేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగడం లేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలుగులో విద్య గగనమైపోయిందన్నారు. ప్రభుత్వాల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత రచయితలపైనే ఉందని అభిప్రాయపడ్డారు.
"తెలుగు భాషా, సాహిత్యం గురించి ప్రజలను ఆలోచింప చేయడమే ఈ సభల ధ్యేయం. అమ్మ భాషను కాపాడుకుందామనే సందేశం ఇవ్వడమే ఈ సభల లక్ష్యం. మా భాషలో పరిపాలన చేసుకోవడానికి, మా భాషలో చదువుకోవడానికి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన పోరాటానికి అమరజీవి పొట్టి శ్రీరాములు చేసుకున్న ఆత్మార్పణను మననం చేసుకొని, ఆయన ఆశయాలను ఎంత వరకు నేరవేర్చామో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది." -మండలి బుద్ధప్రసాద్, గౌరవ అధ్యక్షుడు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం
తెలుగు వాడుక భాషగా ఇంకా ప్రజలకు దగ్గర కాలేదు :స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలుగు భాష పరిరక్షణ కోసం ఏ ప్రభుత్వం దృష్టి సారించలేదని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇప్పటికీ తెలుగు వాడుక భాషగా ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుదిశ్వాస వరకూ తెలుగు భాష సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన రామోజీరావు సభా వేదిక నుంచి రచయితలను చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం తనముందు సాక్షాత్కరిస్తున్నట్లుగా ఉందని అన్నారు.