Elon Musk About H1B Visa : హెచ్1బీ వీసాలకు స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తూ గత వారం గొంతెత్తిన టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా వెనక్కి తగ్గారు. వాటి కోసం యుద్ధానికైనా సిద్ధమేనంటూ అన్న ఆయన గొంతును సవరించుకున్నారు. విచ్ఛిన్నమైన ఆ విధానంలో భారీ సంస్కరణలు అవసరమంటూ తాజాగా ఆయన అభిప్రాయపడ్డారు.
"స్పేస్ ఎక్స్, టెస్లా వంటి వందలాది కంపెనీలను స్థాపించిన నాలాంటి వ్యక్తులు అమెరికాను బలంగా తయారు చేయడంలో హెచ్1బీ వీసాలదే కీలక పాత్ర. స్వేచ్ఛ, అవకాశాలకు గమ్య స్థానం అమెరికా. అందుకే హెచ్1బీ వీసాలపై ఎవరితోనైనా సరే నేను పోరాడటానికి సిద్ధమే" అని గత వారం మస్క్ పేర్కొన్నారు.
అయితే తాజాగా ఆయన కామెంట్స్‌పై ఓ నెటిజన్ స్పందించారు. "ప్రపంచంలోనే అత్యంత నిపుణులైన వ్యక్తులకు అమెరికా గమ్యస్థానం కావాల్సిందేనని, కానీ ప్రస్తుత హెచ్1బీ వీసాల వ్యవస్థ వీటికి పరిష్కారం కాదంటూ ఆ నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దీంతో ఈ విషయంపై ఆదివారం మరో సారి మస్క్ స్పందించారు.
"కనీస వేతనాన్ని గణనీయంగా పెంచి, దాంతో పాటు హెచ్1బీ వీసా నిర్వహణ వ్యయాన్ని అదనంగా చేర్చితే ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. దీని వల్ల దేశీయంగా నిపుణులను నియమించుకోవడం కంటే విదేశాల నుంచి తీసుకురావడం మరింత భారం అవుతుంది. విచ్ఛిన్నమైన ఈ విధానంలో భారీ సంస్కరణలు అవసరం అనే విషయంలో నేను చాలా క్లారిటీతో ఉన్నాను" అని ఎక్స్ వేదికగా మస్క్ పేర్కొన్నారు.
ఎక్స్ ఖాతాకు క్రిప్టో కరెన్సీ పేరు పెట్టుకున్న మస్క్!
ఇదిలా ఉండగా, మస్క్ తాజాగా తన ఎక్స్ అకౌంట్ పేరును 'కేకియస్ మాక్సిమస్'గా మార్చుకున్నారు. అయితే క్రిప్టో కరెన్సీకి సపోర్ట్‌గా ఆయన ఈ పేరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేకియస్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్. పలు బ్లాక్ చెయిన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇది అందుబాటులో ఉంది. ఈ క్రిప్టో ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో మస్క్ ఆ కరెన్సీ పేరును తన బయోలో చేర్చారని తెలుస్తోంది.
H-1B వీసాలకు నేనెప్పుడూ అనుకూలమే: డొనాల్డ్ ట్రంప్
హెచ్1బీ వీసా ఇష్యూ! ట్రంప్ వర్గంలో చీలికలు - సోషల్ మీడియాలో పరస్పరం ఘాటు విమర్శలు!