Women Pushing An RTC Bus In Warangal : మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో మగవాళ్లు సీట్లు లేక నిలబడాల్సి వస్తుంది. కానీ బస్సుల్లో ఎక్కిన మహిళలకు కూడా కొన్ని కొన్నిసార్లు పలు తిప్పలు తప్పడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు, అప్పుడప్పుడు మొరాయించిన బస్సులనూ తొయ్యాల్సిన అవసరం ఆ బస్సులో ప్రయాణించే మహిళకు ఉంటుందని వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన రుజువు చేసింది.
వివరాల్లోకి వెళ్తే: వరంగల్-నల్గొండ ప్రధాన దారిలో మహబూబాబాద్ నుంచి వరంగల్ వస్తున్న పల్లె వెలుగు బస్సు శనివారం తీగరాజుపల్లి సమీపంలో మొరాయించింది. దీంతో డ్రైవర్ బస్సును తోయాల్సిందిగా ప్రయాణికులను కోరారు. బస్సులో మగవాళ్లు ఎక్కువ మంది లేరు. కొంత మంది ఉన్నా, తమకు సీట్లే ఇవ్వట్లేదు, తాము ఎందుకు నెట్టాలి అనుకున్నారో ఏమో కానీ బస్సులో ఉన్న మహిళలే దిగి బస్సును తోసారు.