Woman and her two daughters died : దొంగతనం కేసులో భర్తను పోలీసులు తీసుకెళ్లారనే అవమాన భారంతో మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో విషాదం నింపింది. నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ, ప్రెజా ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఐదు నెలల క్రితం వరకు బాజీ కుటుంబంతో కలిసి ఖమ్మంలో బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. ఇదే సమయంలో బాజీపై కొంతకాలం క్రితం పలు పోలీస్ స్టేషన్లలో బైక్, చైన్ స్నాచింగ్ దొంగతనాల కేసులు నమోదయ్యాయి. గతంలో పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.
బుధవారం సాయంత్రం ఇద్దరు పోలీసులు బాజీ వద్ద ఓ బైక్ తాళం తీసుకుని వెళ్లారు. ఇవాళ ఉదయం మళ్లీ వచ్చి అతణ్ణి కూడా తీసుకెళ్లారు. ఈ సమయంలో పోలీసులు వారి ఇంటిని కూడా తనిఖీలు చేశారు. బాజీ భార్య ప్రెజా, అతని తండ్రిని పలు ప్రశ్నలు అడిగారు. తరువాత తండ్రి బయటకు వెళ్లిన తరువాత ప్రెజా ఇద్దరు పిల్లలను ఇంట్లో రేకుల కడ్డీలకు ఉరేసి చంపి, తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైరా ఏసీపీ రెహమాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.