Phone Tapping Case Latest Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు చేసిన పనికి ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్‌డిస్కుల్లో ఎస్‌ఐబీ దశాబ్దాల నుంచి సేకరించిన డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ధ్వంసం చేసిన వాటిని నాగోల్‌లోని మూసీలో పడేయగా, వాటిని పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపారు. కానీ వాటిలోని డేటాను రీట్రైవ్ చేయడం అసాధ్యమని అధికారులు తెలిపినట్లు సమాచారం.
మావోయిస్టులు, అసాంఘిక శక్తలపై ఎస్‌ఐబీ సాధారణంగా దృష్టి పెడుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన డేటా అంతా ఎస్‌ఐబీ హార్డ్ డిస్కుల్లో భద్రపరిచింది. కాగా 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన ప్రణీత్ రావు, ఆ మొత్తాన్ని తీసుకెళ్లి మూసీలో పడేశాడు. డిసెంబర్ 4న ప్రభుత్వం మారిన తర్వాత భయంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని ధ్వంసం చేసి, స్వయంగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి నాగోల్ వంతెన వద్ద మూసీలో కలిపేశాడు. దాంతో దశాబ్దాల నుంచి సేకరించిన సమాచారం అంతా లేకుండాపోయినట్లైంది.
ఫోన్ ట్యాపింగ్ కోసం ఆ సాఫ్ట్‌వేర్ టూల్ : మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సమకూర్చిన సాఫ్ట్‌వేర్ టూల్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కంపెనీ డైరెక్టర్లుగా కన్వర్జెన్స్ పాల్ రవికుమార్ బూసి, శ్రీవల్లి గోడిలు ఉన్నారని తెలిపారు. వీరిద్దరు మరో ఆరు కంపనీలకు సీఈవోలుగానూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు - సాఫ్ట్‌వేర్ సమకూర్చుకుంది హైదరాబాద్ నుంచే!