Wings India Air Show 2024 Second Day : హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024(Wings India 2024) ప్రదర్శన రెండో రోజు సందడిగా సాగింది. విద్యార్థులు, యువతతో పాటు విమానయాన రంగానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఆయా ఎయిర్‌లైన్స్, కంపెనీల నూతన ఒరవడి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫోటోలు, వీడియోలతో విజిటర్లు సందడి చేశారు.
రానున్న 20 ఏళ్లలో విమాన ప్రయాణికుల్లో 8 శాతం వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న వాణిజ్య విమానయాన మార్కెట్‌గా దక్షిణాసియా అవతరిస్తుందని బోయింగ్(Boeing) అంచనా వేసింది. దీనికి భారతే నాయకత్వం వహిస్తుందని తెలిపింది. వింగ్స్ ఇండియా ప్రదర్శన దేశంలో బలమైన ఆర్ధిక వ్యవస్థతోపాటు, వేగంగా విస్తరిస్తున్న మధ్య తరగతి విమాన ప్రయాణికుల వృద్ధికి దోహదం చేస్తుందని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డారెన్ హల్ట్స్ తెలిపారు.
Boeing on Aviation Growth in India : 2042 నాటికి భారత్ సహా దక్షిణాసియాకు 2,705 కొత్త విమానాలు అవసరం అవుతాయని వెల్లడించారు. వాటిలో 92 శాతం విమానాలు భారత్‌కే కావాల్సి ఉందని వివరించారు. దాదాపు 28 శాతం పాత విమానాలు అధునాతన సాంకేతిక విహంగాలతో భర్తీ అవుతాయన్నారు. రాబోయే మూడేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, మధ్య ఆదాయ కుటుంబాలు పెరుగుతాయని అంచనా వేశారు.