Why Is It Important To Spend Quality Time with your Family? :
- నల్గొండ జిల్లాలోని ఓ ఫ్యామిలీలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులే. పిల్లల మంచీచెడులు చూసే తీరిక లేదు. కావాల్సిన ఆర్ధిక వనరులను సమకూరుస్తూ పనివాళ్లకు అప్పగించారు. ఈ క్రమంలోనే ఎదిగిన బిడ్డ ప్రవర్తనలో మార్పు వచ్చింది. మత్తుకు బానిసై చివరకు చదువు పక్కదారి పట్టింది. అతడిని సరిదిద్దేందుకు తల్లిదండ్రులు నానాయతన పడ్డారు. ఓ బాలిక సెల్‌ఫోన్‌కు బానిసయ్యింది. అధిక సమయం చరవాణి చూడొద్దని వారించే పరిస్థితి ఇంట్లో లేదు. ఫలితంగా కొన్నాళ్లకు నిద్రలేమి, మానసిక సమస్యలు ఎదురయ్యాయి. ఆ బాలిక చదువు పక్కదారి పట్టింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.
- సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద సంపాదనలో పడి వారానికి ఒక్క రోజైనా ఫ్యామిలీకి కేటాయించేవారు కాదు. తల్లి పర్యవేక్షణా అంతంతమాత్రమే. ఫలితంగా ఆప్యాయతలు కరవయ్యాయి. కళాశాలలో పరిచయమైన ఓ యువకుడితో విద్యార్థిని లవ్‌లో పడింది. అతడి మాయమాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిపోవాలనే నిర్ణయానికి రాగా జరిగిన నష్టాన్ని తల్లిదండ్రులు కాస్త ఆలస్యంగా గుర్తించారు.
- ఆప్యాయతల పొదరిల్లులా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కళకళలాడేవి. మరి ఇప్పుడో ఎటు చూసినా చిన్న కుటుంబాలే. కన్న పిల్లలతోనైనా తల్లిదండ్రులు సరదాగా కాసేపు సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులు. ఉపాధి, జాబ్‌ల హడావుడి. తీరికలేని వ్యాపకాలు పని టెన్షన్లు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక చిరాకులు. కాస్త తీరిక దొరికితే చాలు ఎవరికి వారు సెల్ఫోన్లో ముచ్చట్లు. ఆదివారం వచ్చిందంటే వారమంతా అలిసిపోయాను ఈ రోజు విశ్రాంతి తీసుకోవాలి అనే పరిస్థితి. పేరెంట్స్ సరైన పర్యవేక్షణ లేకపోవడమే పిల్లలు పక్కదారి పట్టేందుకు ప్రధాన కారణమని నిపుణుల వాదన.
కలిసుంటే కలదు సుఖం :పిల్లల పెంపకం విషయంలో భార్యాభర్త మధ్య అనుబంధం అతి ముఖ్యమైనది. పేరెంట్స్ ఇరువురూ బాధ్యత తీసుకునేందుకు ఇది బాగుంటుంది. తల్లిదండ్రులు దైనందిత పనుల్లో బిజిబిజీగా ఉండి పిల్లలను ఓ కంట కనిపెట్టడం, వారితో కొంత సమయం వెచ్చించడం వంటివి మానేయడంతో సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో ఒకరికి ఒకరుగా ఉంటే కుటుంబ వ్యవస్థ గాడిలో పడినట్లే. వారమంతా బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం లాంటి సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపితే కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటే అంతా సాఫీగా సాగిపోతుంది.