Macherla MLA Pinnelli Ramakrishna Reddy :ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీ మారినా అధికార పార్టీ నాయకులపై పోలీసుల స్వామిభక్తిలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి పిన్నెల్లి ఉదంతమే నిదర్శనం. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. దానిపై రెంటచింతల పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందిపై సెక్షన్ 307, 147, 148, 120బీ, 324, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణారెడ్డిని ఏ-1గా పెట్టారు. పోలింగ్ మరుసటిరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు.
Pinnelli EVM Damage Case : వందల మంది రౌడీమూకలతో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ సానుభూతిపరులపై విరుచుకుపడి, ఆస్తులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, మరికొందరిపై ఐపీసీ 307, 332, 143, 147, 324, 149 సెక్షన్ల కింద కింద ఈ నెల 14వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఒక సీఐని దారుణంగా కొట్టి గాయపరిచినా ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేయలేదు.
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాత్రమే పిన్నెల్లిని వచ్చే నెల 6 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు చెప్పింది. హత్యాయత్నం నేరం కింద ఐపీసీ సెక్షన్ 307 కింద ఎమ్మెల్యేను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ దాఖలైన కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేయవద్దని చెప్పలేదు. ఈవీఎం ధ్వంసం కంటే హత్యాయత్నం తీవ్రమైన నేరమైనప్పుడు ఆయన్ను వెంటనే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎమ్మెల్యేపై సెక్షన్ 307 కింద రెండు కేసులు నమోదైనా అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
'చంపెయ్యండ్రా' అంటూ కత్తులతో దాడి : పోలింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బూత్‌లోకి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టారని తాను అడ్డుకోబోతే వేలు చూపించి బెదిరిస్తూ పరుష పదజాలంతో దూషిస్తూ 'చంపెయ్యండ్రా' అంటూ హూంకరించారని నంబూరి శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు చింతా సుబ్బారావు, మరికొందరు కర్రలు, రాడ్లతో, కత్తులతో తనపై దాడి చేశారని తీవ్రంగా గాయపడ్డ తాను అక్కడే కిందపడిపోగా చచ్చాడులేరా అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వెళ్లిపోయారని ఫిర్యాదులో తెలిపారు. అనంతరం బంధువుల సాయంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నానని స్పష్టం చేశారు.