Why are Pulses Soaked in Water Telugu : ప్రతి ఇంటి కిచెన్‌లో పప్పులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పప్పులను కూరలుగానూ, నానబెట్టి తినడం, పొడుల రూపంలోనూ వాడుతారు. పప్పుల ద్వారా శరీరానికి మాంసం తినడానికన్నా ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి. అందుకే ప్రతి పేదవాడు మాంసం తెచ్చుకోపోయినా పప్పులను వంటకాల్లో వాడుతారు. కొందరు డైలీ డైట్లో ఉదయం నానబెట్టిన పప్పు గింజలను తింటారు. మరికొంత మంది స్నాక్స్‌గా ఉడికించి తింటారు. అసలు ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా? పప్పులను వండే ముందు ఎందుకు నానబెడతారని? దీనివల్ల ఉపయోగం ఏంటని? అసలు ఏ పప్పును ఎన్ని గంటలు నానబెట్టాలో తెలుసా? ఎలా నానబెట్టాలో మీకు ఐడియా ఉందా?
ఎందుకు నానబెట్టాలంటే : కంది, శెనగపప్పు, పెసర, రాజ్మా గింజలు, కాబూలీ శెనగలు వంటివి మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటాం. అయితే వీటిని వండుకునే ముందు కొన్ని గంటల పాటు నానబెట్టడం మనకు అలవాటే. నిజానికి ఈ ప్రక్రియ వల్ల అవి తొందరగా ఉడకడమే కాకుండా జీర్ణ వ్యవస్థకూ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పప్పులను నానబెట్టడం వల్ల వీటిలో ఉండే ఫైటేస్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అయి ఇది పప్పుల్లోని పోషకాల్ని శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. అలాగే నానబెట్టడం వల్ల ఇంకో లాభం ఉందండోయ్. అదే అమైలేజ్ అనే సమ్మేళనం యాక్టివేట్ అయి పప్పులు, కాయధాన్యాల్లోని సంక్లిష్ట పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని ఫలితంగా అవి త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. ఫలితంగా కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి జీర్ణ సమస్యలను దూరం చేయవచ్చు.
పప్పులను ఎంతసేపు నానెబెట్టాలో తెలుసా? : పప్పులు, కాయధాన్యాలను ఒక్కో రకాన్ని బట్టి దాన్ని నానబెట్టే సమయం మారుందని నిపుణులు చెబుతున్నారు. వాటిలో
- కంది, పెసర, మినప్పప్పు, శెనగ వంటివి 6-8 గంటలు నాననివ్వాలి.
- మినుములు, పెసలు వంటి ముడిపప్పులను 8-12 గంటల పాటు నానబెట్టాలి.
- కాబూలీ శెనగలు, రాజ్మా, శెనగలు వంటి కాయధాన్యాల్ని 12-18 గంటలు నానబెట్టాలి. ఇక ఇంత సమయం లేదనుకునేవారు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వండుకున్నా ఫర్వాలేదు.